కిరణ్ అబ్బవరం కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన సినిమా ‘క’. ‘ఈ సినిమా హిట్టవ్వకపోతే… సినిమాలు మానేస్తా’ అని శపథం చేసి మరీ… హిట్టు కొట్టాడు. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రానికి మెరుగైన ఫలితాలొచ్చాయి. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈటీవీ విన్ లో `క` స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ రికార్డు వ్యూస్ సొంతం చేసుకొంది. ఇప్పుడు ఈ విజయాన్ని కిరణ్ క్యాష్ చేసుకోవడం చాలా అవసరం.
క్యాష్ అనే మాట రెండు అర్థాల్లో వాడొచ్చు. పారితోషికం పరంగా, మంచి కథల్ని ఎంచుకొనే విషయంలోనూ. నిన్నా మొన్నటి వరకూ కిరణ్ పారితోషికం అంతంత మాత్రమే. తాను కూడా ఎప్పుడూ పారితోషికంపై దృష్టి పెట్టలేదు. ‘సినిమా క్వాలిటీగా వస్తే చాలు’ అనుకొన్నాడు. ‘క’ సినిమా విషయంలోనూ అదే చేశాడు. తన పారితోషికాన్ని సైతం.. క్వాలిటీ కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దానికి తగిన ప్రతిఫలాలు అందుకొనే అవకాశం వచ్చింది. మరోవైపు కిరణ్ కథలకు ఇప్పుడు బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. క్వాలిటీ మేకింగ్ పై దృష్టి పెట్టడానికి ఇప్పుడు స్కోప్ దొరికింది. పాన్ ఇండియా పరంగా ఈ సినిమాకు మంచి ఫలితాలు వస్తాయని కిరణ్ ఆశించాడు. కానీ ఆ ప్రయాణం అనుకొన్నంత సవ్యంగా సాగలేదు. ఒకేసారి దేశ వ్యాప్తంగా సినిమా విడుదల చేసే ఛాన్స్ కిరణ్ కు దక్కలేదు. మలయాళంలో ఈ సినిమా విడుదలైంది. కానీ అక్కడ అదే సమయానికి ఆరేడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో ‘క’ కనిపించకుండా పోయింది. హిందీలో ఇంకా ఈ సినిమా రిలీజ్ చేయలేదు. అక్కడ ఓ మంచి డీల్ వచ్చిందని నిర్మాతలు చెబుతున్నారు. బహుశా.. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయేఊమో. కిరణ్ ని నమ్మి ఇప్పుడు నిర్మాతలు వస్తున్నారు. ‘క’ కోసం కిరణ్ ఎంత తీసుకొన్నాడో అంతకు రెట్టింపు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిర్మాతలు కిరణ్‌కు టచ్‌లో ఉన్నారు. ఈ మూడు సినిమాలూ పట్టాలెక్కగలిగేవే. కెరీర్లో ఈ ఫేజ్‌ని కిరణ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొవాలి మరి.