పులివెందుల నియోజకవర్గం అంటే అదో ఇంటర్నల్ బీహార్ అన్నట్లుగా మార్చేసింది వైసీపీ దోపిడీ బ్యాచ్. దీనికి తాజాగా ఉదాహరణ హైదరాబాద్ నుంచి కార్లు అద్దెకు పేరుతో తెచ్చుకుని తిరిగి ఇవ్వకపోవడం. ఎవరైనా కారు మాదే అని వస్తే వారిని చితకబాదడం. తాజాగా పులివెందులకు వెళ్లిన తెలంగాణ పోలీసులు ఇలా కొట్టుకొచ్చిన ఆరు కార్లను స్వాధీనం చేసుకుని యజమానులకు ఇచ్చారు. ఈ కార్లను తెచ్చుకుంది వైసీపీ జడ్పీటీసీ సభ్యులు…ఇతర పదవుల్లో ఉన్నవారు. వీరంతా అవినాష్ రెడ్డి దగ్గర మనుషులు.
సంగారెడ్డికి చెందిన సతీష్ అనే వ్యక్తి కార్ రెంటల్స్ వ్యాపారం చేస్తూంటారు. ఈ సతీష్ దగ్గర నుంచి ఆరు కార్లు అద్దెకు తీసుకుని వాటిని నేరుగా పులివెందులకు తీసుకెళ్లిపోయారు. ఇది జరిగి మూడేళ్లవుతోంది. కార్లు ఇవ్వడం లేదు.. రెంట్లు ఇవ్వడం లేదని సతీష్ పోలీసు కేసు పెట్టారు. అయితే అప్పట్లో దొంగలకే పోలీసుల సహకారం కాబట్టి…కార్లను సతీష్ తెచ్చుకోలేకపోయారు సరి కదా.. కొట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తెలంగాణ పోలీసుల్ని తీసుకెళ్లి తమ కార్లను తాము తెచ్చుకున్నారు.
వైసీపీ నేతల నిర్వాకం చూసి.. ఇలా అద్దె పేరుతో కార్లు తెచ్చి సొంత కార్లలా వాడేసుకుంటున్న వైనం చూసి అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు వాడే కార్లు వారివేనా లేకపోతే ఇలా తెచ్చుకున్నవా అని ఆరా తీస్తున్నారు. వారి క్రెడిబులిటీ అలా ఉంది మరి. ముఠా నాయకుడు వ్యవస్థలకు అధిపతి అయితే.. అనుచరులు ఎవరు దొరికితే వాడని ఎవరి స్థాయిలో వారు దోచుకుంటారనేది ఐదేళ్ల ఏపీ పాలనే సాక్ష్యంగా మారింది.