డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందు కోసం తన యంత్రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ట్రంప్ పలువురు భారత సంతతికి చెందిన అమెరికన్లను కీలక పదవుల్లో నియమిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ అలియాస్ కాష్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా నామినేట్ చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఇటీవల అదానీ విద్యుత్ ఒప్పందాల విషయంలో ఎఫ్‌బీఐ అంశం మన దేశంలోనూ చర్చనీయాంశమవుతోంది. ప్రపంచంలో అత్యంత సమర్థమైన దర్యాప్తు ఏజెన్సీగా ఎఫ్‌బీఐకి పేరు ఉంది. ఇలాంటి సంస్థకు కశ్యప్ అలియాస్ కాష్ పటేల్‌ను నామినేట్ చేశారు. కాష్ పటేల్ ఓ లాయర్, ఇన్వెస్టిగేటర్. కాష్ పటేల్ తన కెరీర్‌ను అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని, అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం గడిపారని ట్రంప్ కొనియాడారు. దీంతో భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తికి అమెరికాలో పెద్ద బాధ్యత లభించినట్లు అయింది.
గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాకు చెందిన ఉంగడా నుంచి కెనడాకు, అక్కడ నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో గుజరాతీ భారతీయ దంపతులకు క్యాష్ పటేల్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి వివిధ హోదాల్లో సేవలందించారు.