ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీను అనే టీడీపీ యువ కార్యకర్త వ్యక్తిగత కష్టాలతో ఆత్మహత్య చేసుకోవడం ఆ పార్టీలో అందర్నీ కలసి వేసింది. శ్రీను లోకేసిస్ట్ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకుని యాక్టివ్‌గా ఉంటారు. ఏ కష్టం వచ్చిందో కానీ ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. విషయం లోకేష్ దృష్టికి వెళ్లడంతో అత్యున్నత వైద్యం అందించారు. కానీ శ్రీను ప్రాణాలు నిలువలేదు. దీంతో టీడీపీ సోషల్ మీడియా మొత్తం షాక్ కు గురైంది. నారా లోకేష్ భావోద్వేగ ట్వీట్ చేశారు.
కన్నీరు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా
శ్రీను అనే కార్యకర్త నేరుగా చాలా మందికి పరిచయం ఉండదు. కానీ సోషల్ మీడియాలో మాత్రతం అందరికీ చిరపరిచితుడే. ఇతరుల్లా అసభ్యకామెంట్లతో విరుచుకుపడే రకం కాదు. లోకష్‌కు..టీడీపీకి మద్దతుగా మాట్లాడే సందర్భం వస్తే మాత్రం అసలు వదిలి పెట్టరు. అలాంటి నిస్వార్థమైన కార్యకర్త బలవన్మరణం చెందడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. తెలిసిన తరవాత ఆయన ప్రాణాల్ని కాపాజుకునేందుకు టీడీపీ సోషల్ మీడియా నుంచి.. లోకేష్ ఆఫీస్ నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. లోకేష్ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆవేదనగా లోకేష్ ట్వీట్ పెట్టారు.
ఆత్మీయులకు కష్టాలు చెప్పుకోవడం తప్పు కాదు !
ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పార్టీ జెండా భుజాన మోసేవారు లక్షల్లో ఉంటారు. ఇలాంటి కార్యకర్తలు తమకు ఏదైనా కష్టం వస్తే నేతల్ని అడగడానికి సంశియిస్తూంటారు.. పార్టీపై తమ అభిమానానికి తాము విలువ కట్టుకుంటున్నామేమో అది సరి కాదని అనుకుంటూ ఉంటారు. అలాంటివారే ఎక్కువ. లోకేష్ పర్సనల్ నెంబర్ కు శ్రీను ఎన్నో సార్లు పార్టీ అంశాలపై మెసెజ్ చేశారు. ఈ విషయాన్ని లోకేష్ తన ట్వీట్లో చెప్పారు. కానీ తనకు వచ్చిన పర్సనల్ కష్టం గురించి చెప్పుకోలేదు. అలా చెప్పి ఉంటే .. ఆయనకు వచ్చిన సమస్య పరిష్కరించగలిగేది అయితే…లోకేష్ పరిష్కరించడానికి తన ఆఫీస్‌ను అయినా పురమాయించేవారు. ఆపని చేయకుండా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.
తానున్నానని భరోసా ఇచ్చేలా లోకేష్ ట్వీట్
ప్రతి వ్యక్తికి కష్టాలుంటాయి. నా కష్టాలతో పోలిస్తే మీ కష్టాలు ఎంత అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగని కష్టాలు తీర్చేందుకు ఎవరో వస్తారని. ఆశించడం కూడా తప్పే. కానీ ఎవరినైనా సాయం అడగడం మాత్రం తప్పు కాదు. సాయం అడగడటం ఆత్మాభిమానాన్ని తక్కువ చేసుకోవడం కాదు. ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు. ఏ పార్టీలో అయినా కింది స్థాయి కార్యకర్తల్లో ఇలాంటి వారే ఎక్కువగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సాయం చేయమని అడగడానికి సంశయించే కార్యకర్తలకు కావచ్చు.. ద్వితీయ శ్రేణి నేతలకు కావచ్చు.. లోకేష్ చేసిన ట్వీట్ కచ్చితంగా కొండంత బలాన్నిచ్చేలా ఉందనే చెప్పాలి. ఏమైనా ఇబ్బందులుంటే నేతల దృష్టికి తీసుకెళ్తే.. పరిష్కారం మార్గం ఏదోక రూపంలో దొరుకుతుందేమోననే నమ్మకాన్ని కలిగించేలా లోకేష్ తన ట్వీట్ చేశారు.
ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుంది.. చావు కాదు!
ప్రతి ఒక్కరికీ ఆర్థిక సమస్యలే ఉండవు. ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. టీడీపీలో కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటారు. పార్టీ హైకమాండ్ లక్షల మంది గురించి రోజూ ఆరా తీయలేకపవచ్చు.. కానీ చెప్పుకుంటే ఏదో రూపంలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుంది. మాట సాయం కావచ్చు.. ఆర్థిక సాయం కావచ్చు.. సమస్య పరిష్కారానికి ఎవరో ఒకరు చొరవ తీసుకుంటారు. అందరి సమస్యలను తీర్చలేకపోవచ్చు.. అందర్నీ సంతృప్తి పరచకపోవచ్చు. కానీ నేనున్నానే భరోసా ఇస్తే కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుంది. ప్రస్తుతం లోకేష్ అలాంటి ప్రయత్నం చేశారు.
కింది స్థాయి నేతలు మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం
నియోజకవర్గాల్లోని స్థానిక నేతలు వారి వారి పరిధిలో.. వారి కోసం.. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి వారికి కాస్తో కూస్తో చేయూత ఇస్తే.. అదే వారికి అతి పెద్ద సాయంగా ఉంటుంది. పార్టీ కోసం నియోజకవర్గాలు, గ్రామాల స్థాయిలో పని చేసిన వారిని గుర్తించడం పెద్ద విషయం కాదు. వారిలో చాలా మంది ఏమీ ఆశించరు. కానీ కష్టాలో ఉన్నప్పుడు వారిని పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి అన్నీ హైకమాండ్ స్థాయిలో జరగడం కష్టం.
కార్యకర్తల కోసం లోకేష్ ప్రత్యేక వ్యవస్థ
లోకేష్ క్రీయాశీల రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి కార్యకర్తల సంక్షేమం బాధ్యతలనే చేపట్టారు. ఇన్సూరెన్స్ నుంచి ప్రత్యేక నిధి, వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా కొంత మంది ఇలా సాయం అడగడానికి కూడా ఫీలైపోయి… తమ కష్టాలతో నిండా మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం కలచి వేస్తోంది. అందుకే గొంతెమ్మ కోరికలు కోరే వారి సంగతి పక్కన పెట్టి… పార్టీ కోసం నిజాయితీగా పని చేసిన వారికి అవసరమైన మనోదైర్యం ఇచ్చేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయనున్నారు అందులో మొదటి అడుగే ఈ ట్వీట్ అనుకోవచ్చు.