తెలంగాణా రాష్ట్రంలో న్యాయవ్యవస్థలో ప్రస్తుతం నెలకొనున్న సంక్షోభాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. చివరికి అది ఏ విపరీత పరిణామాలకి దారి తీస్తుందో ఊహించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజనకి అడ్డుపడుతున్నారని తెరాస నేతలు చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. హైకోర్టు ద్వారా ఆయన తెలంగాణాపై కర్ర పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళయినా ఇంకా ఆయన తెలంగాణాపై తన పట్టుకోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే హైకోర్టు విభజనకి మోకాలు అడ్డుతున్నారని తెరాస నేతలు ఆరోపించడం అందరూ వినే ఉంటారు. తెలంగాణా న్యాయవ్యవస్థలో ఆంధ్రాకి చెందిన న్యాయమూర్తులని, ఉద్యోగులని కేటాయించడంపై ప్రస్తుతం తెలంగాణా న్యాయవాదులు పోరాడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులే పనిచేయలనుకోవడం సహజమే. కనుక తెలంగాణా న్యాయవ్యవస్థలో ఆంధ్రా న్యాయమూర్తులు, ఉద్యోగులు చేయడాన్ని నిరసించడం కూడా సహజం, సబబే.
తెరాస నేతల ఆరోపణలు, ప్రస్తుతం జరుగుతున్న పోరాటాల నేపధ్యంలో ఈ సమస్యని మరి కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ తమ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకొంటున్నట్లు అర్ధమవుతుంది. తెరాస ఆరోపణల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయవ్యవస్థని మేనేజ్ చేస్తూ తద్వారా తెలంగాణాపై కర్ర పెత్తనం చేస్తున్నారని, అందుకే దానిపై తన పట్టు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన హైకోర్టు విభజనకి సహకరించడంలేదని చెపుతున్నట్లుగా అర్ధమవుతోంది.
దానిని వ్యతిరేకిస్తున్న తెరాస నేతలు తెలంగాణా న్యాయవ్యవస్థలో తమ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలని కోరుకోవడం అంటే వారు కూడా దానిపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారనే అర్ధం.
అంటే న్యాయవ్యవస్థపై ప్రభుత్వాలని నడుపుతున్న రాజకీయ పార్టీలు, వాటి నేతలు నియంత్రణ కోరుకొంటున్నాయని భావించవచ్చు. ఇది చాలా అవాంచనీయమైన ఆలోచనగానే చెప్పక తప్పదు. అయితే దీనిని ఎవరూ పైకి చెప్పుకోకపోయినా, ఒప్పుకోక పోయినా వారి అభిలాష మాత్రం అదేనని వారి మాటలు, చేతలే చెపుతున్నాయి.
తీవ్ర నేరాలకు పాల్పడినవారు, జైలుకి కూడా వెళ్లి వచ్చిన వాళ్ళు లేదా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు చాలా మంది స్వేచ్చగా తిరుగగలుగుతున్నారు. అంతేకాదు..వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి చట్ట సభలలో కూడా ప్రవేశించడం ఎలాగ సాధ్యం అవుతోందంటే న్యాయవ్యవస్థలపై వారికున్న పట్టు కారణంగానే అని చెప్పకతప్పదు. అందుకే వారు దానిపై తమ పట్టుకోల్పోకూడదని కోరుకొంటే ఆశ్చర్యమేమీ లేదు. దానిపై పూర్తి పట్టున్నప్పుడే ఏదైనా ఒక కేసుని తలుచుకొంటే అవసరమైనప్పుడు పరుగులు తీయించగలరు…వద్దనుకొంటే అటకెక్కించగలరు. అటువంటి ఉదాహరణలు కోకోల్లలున్నాయి.