ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. వారు ఎందుకు రాజీనామాలు చేశారో.. ఎవరు చెబితే రాజీనామాలు చేశారో ఎవరికీ తెలియదు. వారిలో ఇద్దరు మోపిదేవి, బీదమస్తాన్ రావు. మరొకరు ఆర్.కృష్ణయ్య. సాధారణంగా రాజీనామా చేసినా ఆ స్థానాలు మళ్లీ కూటమి పార్టీలకే వస్తాయి కాబట్టి వారు ఆ పార్టీలతో మాట్లాడుకుని రాజీనామాలు చేసి ఉంటారని అందరికీ ఓ క్లారిటీ ఉంది. అయితే వారికి మాత్రం చాన్స్ లేదని వేరే పదవులు ఇస్తారని చెప్పుకున్నారు.
కానీ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రం మళ్లీ వారి పేర్లే తెరపైకి వస్తున్నాయి. మోపిదేవి పదవి కాలం రెండేళ్లే ఉంది. ఆయన తనకు పదవి అవసరం లేదంటున్నారు. మిగిలిన ఇద్దరికీ కూడా రాజ్యసభ పదవి వద్దని చెబుతున్నారని అనుకున్నారు. కానీ బీద మస్తాన్ రావుకు మళ్లీ తన సీటు తనకు హామీ ఇచ్చాకనే రాజీనామా చేశారంటున్నారు. అంటే ఆయన రాజీనామా చేసి.. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడు అవుతారు. కృష్ణయ్య బీజేపీతో ఒప్పందం చేసుకుని రాజీనామా చేశారని అందుకే ఆయనకు బీజేపీ తరపున టిక్కెట్ ఖాయమని అంటున్నారు.
మూడో సీటు కోసం టీడీపీలో కష్టపడిన వారి పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. పలువురు చంద్రబాబును కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చింతకాయల విజయ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఆయన అనకాపల్లి ఎంపీసీటు కోరుకున్నారు. కానీ ఇవ్వలేకపోయారు. టీడీపీ కోసం పదేళ్ల పాటు కష్టాలు పడి…కేసులు ఎదుర్కొని ఆయన పని చేశారు. అందుకే ఆయనను రాజ్యసభకు పంపాలన్నా అభిప్రాయం బలపడుతోంది. ఇంకా చాలా మంది సీనియర్లు రేసులో ఉన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది.