పరిపాలన చేయడం కాదు.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కూడా ఎవరికైనా కీలకమే. లోటుపాట్లు ఉంటే వెంటనే దిద్దుకోవచ్చు. ఇందు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ ను మళ్లీ యాక్టివేట్ చేశారు. లబ్దిదారులు సహా ఇసుకను ఉచితంగా తీసుకున్న వారికి కూడా ఫోన్లు చేసి.. అవినీతి ఏమైనా ఉందా.. సర్వీస్‌లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకునేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్ను మళ్లీ కొత్త ఉత్సాహంతో పని చేసేలా చేస్తున్నారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం గతంలో చంద్రబాబు ఆర్టీజీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వ పరంగా మానిటర్ చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ సారి రిలయన్స్ అధినేత అంబానీ కూడా ఈ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయి తన కంపెనీ ఉన్నత అధికారుల్ని పరిశీలించడానికి పంపించారు. తాము ఉన్నప్పుడే తుపాన్లు దగ్గర నుంచి వీధి లైట్ల వరకూ అన్నింటినీ ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం మానిటర్ చేసింది.
అలాంటి వ్యవస్థను జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు. ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండా అక్కడ పని చేసే వారందర్నీ తీసేశారు. చివరికి దాన్ని నిరుపయోగంగా చేశారు. కరోనా సమయంలో ఓ కల్యాణమండపంలో కొంత మందికి ల్యాప్ ట్యాప్ లు ఇచ్చి క్యాంపు ఏర్పాటు చేసి అదే పెద్ద మానిటరింగ్ సిస్టమ్ అన్నట్లుగా ఓవరాక్షన్ చేశారు. . కానీ ఆర్టీజీఎస్ ను వాడుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు మళ్లీ ఆర్టీజీఎస్ను వినియోగంలోకి తెస్తున్నారు.