‘పుష్ప 2’ టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హైక్… నిర్మాతలకు బోలెడంత భరోసా కల్పించిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. వందల కోట్లతో ఓ భారీ సినిమా తీసి, తొలి వారంలోనే వీలైనంత పెట్టుబడి వెనక్కి తీసుకురావడం కోసం నిర్మాతలు టికెట్ రేట్ల పెంపుపై ఆధారపడతారు. ఇది ప్రతీ సినిమాకూ ఎదురయ్యే ప్రహసనమే. మైత్రీ మూవీస్ కూడా అదే చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకొని, నిర్మాతలకు టికెట్ రేట్లు పెంచుకొనే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రీమియర్ షో టికెట్ రేట్లు మరీ ఎక్కువ అని, సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారని, ఇలాగైతే.. సామాన్యుడి గతేమిటని కొంతమంది ప్రశ్నలు సంధిస్తున్నారు. సినిమా టికెట్ కొనాలంటే ఈ.ఎం.ఐలు అవసరమని, ఆస్తులు తాకట్టు పెట్టాలని జోకులు వేస్తున్నారు. ప్రేక్షకుడిపై ఈరకమైన సానుభూతి ఉండడం అవసరమే. కానీ ఈ విషయాన్ని మరీ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది.
‘పుష్ప 2’పై విపరీతమైన బజ్ ఉంది. ఈమధ్య ఏ సినిమాకీ రానంత క్రేజ్ పుష్ప 2కి వచ్చింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అల్లు ఆర్మీ ఎదురుచూస్తోంది. వాళ్లకు టికెట్ రేట్ ఎంతున్నా పెద్దగా పట్టింపు లేదు. ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడందే వాళ్లకు నిద్రపట్టదు. ఇలాంటి క్రేజ్ ని క్యాష్ చేసుకోకపోవడం నిర్మాతల తప్పు అవుతుంది. కాబట్టి ప్రీమియర్ షోలకు పర్మిషన్లు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులూ తెచ్చుకొన్నారు. ఆర్.ఆర్.ఆర్ ప్రీమియర్ షో టికెట్ ఒక్కింటికీ రూ.3 వేల వరకూ పలికింది. అప్పట్లో అదే రికార్డు. అయినా సరే, ప్రీమియర్లు చూడ్డానికి ప్రేక్షకులు తహ తహలాడిపోయారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అభిమాన హీరోల సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తారు? అనేదానికి అదే నిదర్శనం. ఇప్పుడు పుష్ప కూడా అదే చేస్తోంది.
తమ ప్రాడెక్ట్ ధర ఎంత ఉండాలో నిర్ణయించుకొనే అధికారం నిర్మాతలకు ఉంది. ఆ ప్రాడెక్ట్ కొనాలా వద్దా? అనేది వినియోగ దారుడి చేతుల్లో ఉంటుంది. సినిమా కూడా అంతే. టికెట్ రేట్ ఎంతన్నది నిర్మాత ఇష్టం. ఎప్పుడు చూడాలి అనేది ప్రేక్షకుడి అభీష్టం. కాక హోటెల్ లోనూ, ఫైవ్ స్టార్ హోటెల్ లోనూ దోశ అందుబాటులో ఉంటుంది. రుచి ఒకేలా ఉండొచ్చు. ధర మాత్రం చాలా తేడా. ఐఫోన్, చైనా ఫోన్.. రెండింట్లోనూ ఒకేరకమైన టెక్నాలజీ ఉండొచ్చు. కానీ ఆ బ్రాండ్ వేరు. ధర వేరు. సినిమానీ అలానే చూడాల్సిన అవసరం ఉంది. ప్రీమియర్ల టికెట్ రేటు ఎక్కువ అనుకొంటే, ఓ వారం ఆగొచ్చు. అప్పుడు టికెట్ రేట్లు ఆటోమెటిగ్గా తగ్గుతాయి. సింగిల్ స్క్రీన్ లో రూ.100 కు, మల్టీప్లెక్స్‌లో రూ.150కూ అందుబాటులో ఉంటాయి. అదీ వీలు కాదనుకొంటే నాలుగు వారాలు ఆగితే ఓటీటీలోకి వస్తుంది. సినిమా బాగుంటే, చూడాలనుకొంటే ప్రేక్షకుడు ఆగడు. టికెట్ రేట్ ఎంతైనా కొంటాడు. అదే క్రేజ్ లేకపోతే, నచ్చకపోతే… ఫ్రీగా అందుబాటులో ఉన్నా, చూడ్డానికి మనసొప్పదు. ఏదైనా కంటెంటే నిర్ణయిస్తుంది. అదే మాట్లాడుతుంది. మధ్యలో ఎవరెంత మాట్లాడినా లాభం లేదు.