వినోదం, విషాదం మేళవించిన జీవితం సిల్క్ స్మితది. ఆకాశమంత ఎత్తు ఎదిగి, అధఃపాతాళానికి పడిపోయిన వైనం… చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోదు. సిల్క్ గురించి ఎన్ని కథలు విన్నా, ఇంకా వినాలనిపిస్తుంది. ఆమె జీవితం చుట్టూ ఎన్ని సినిమాలొచ్చినా, మరోటి చూడాలనిపిస్తుంది. అందుకే సిల్క్ స్మిత జీవితాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. చంద్రిక రవిని సిల్క్ స్మిత పాత్రలో చూపిస్తూ ‘సిల్క్ స్మిత’ బయోపిక్ తయారవుతోంది. ఇది సిల్క్ జీవితంపై వస్తున్న అఫీషియల్ బయోపిక్ అని చిత్రబృందం ప్రకటించింది. జయరామ్ శంకరన్ దర్శకుడు. ఈరోజు సిల్క్‌స్మిత పుట్టిన రోజు. అందుకే ఓ గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం.
దిన పత్రికల్లో, వార్తా పత్రికల్లో హెడ్ లైన్స్ గా మారిన సిల్క్ స్మిత ఎవరంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆరా తీయడంతో ఈ గ్లింప్స్ మొదలైంది. సిల్క్ స్మిత అంటే అప్పట్లో అభిమానులు ఎంత తహతహలాడేవారో… ఈ గ్లింప్స్ లో చూపించారు. సిల్క్ గా చంద్రిక అతికినట్టు సరిపోయిందనిపించింది. ఆమె కళ్లు మంచి ఎట్రాక్టీవ్ గా ఉన్నాయి. ‘డర్టీ పిక్చర్’ కూడా ఇంచుమించుగా సిల్క్ బయోపిక్కే. విద్యాబాలన్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అందులో దాచిన విషయాలూ, చెప్పలేని సంగతులూ ఈ సిల్క్ స్మిత బయోపిక్ లో పూర్తిగా బయట పెట్టబోతున్నారని టాక్. సినిమావాళ్ల జీవితం అంటేనే బోలెడంత మసాలా ఉంటుంది. పైగా ఇది సిల్క్ కథ. కాబట్టి కమర్షియల్ హంగులకు, సంచలన అంశాలకూ కొదవ ఉండకపోవొచ్చు. 2025 ప్రధమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. 2025 చివర్లో విడదలయ్యే ఛాన్సుంది.