తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని వినూత్న రాజకీయ మార్పు జరిగి ఏడాది పూర్తి అయింది. గత ఏడాది ఇదే రోజుున వచ్చిన ఎన్నికల ఫలితాల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైనా విజయం సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అరవై సీట్లను గెల్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ బాబహుబలిగా చెప్పుకునే వైఎస్ఆర్ హయాంలోనూ అన్ని సీట్లు రాలేదు. కానీ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసింది.
ఎవరూ ఆ స్థాయి విజయం అందుకుంటారని అంచనా వేయలేకపోయారు. సర్వేలు .. ఎగ్జిట్ పోల్స్ కూడా ధైర్యంగా చెప్పలేకపోయాయి. అయితే రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత కాలం మరో పార్టీకి చోటు లేదని ఆయనను దాటే లీడర్ లేరని అనుకున్న వారి అంచనాలు పటాపంచలయ్యాయి. తెలంగాణ సరికొత్త లీడర్ గా రేవంత్ రెడ్డి ఆవిష్కృతమయ్యారు. ఎన్నికలకు జరగడానికి ఆరు నెలల ముందుగా పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ విజయంపై నమ్మకం లేదని చాలా మంది బీజేపీకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ను ఓడించేది బీజేపీనే అని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్లు.. బీజేపీ కాదు.. కాంగ్రెస్సే బీఆర్ఎస్ ను ఓడిస్తుందని చెప్పి తిరిగి వచ్చేశారు.
భేషజాలకు పోకుండా అందర్నీ కలుపుకుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. ఇది రేవంత్ .. కాంగ్రెస్ గెలుపు మాత్రమే కాదు.. బీఆర్ఎస్ ఓటమి కూడా. తెలంగాణ వాదాన్ని వదిలేసి.. భారత రాష్ట్ర సమితిగా మార్పు చేసి.. దేశ రాజకీయాలను మలుపు తిప్పాలనుకున్న కేసీఆర్ కు ఎదురైన పరాభవం ఆ ఓటమి. ఓ చిన్న తప్పు చేసి పూర్తిగా అధికారాన్నికోల్పోయారు గ్రేటర్ పరిధిలో తప్ప.. తెలంగాణ వాదానికి ఆయువుపట్టు లాంటి ఉత్తర తెలంగాణలో ఆయన పట్టు కోల్పోయారు. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే ఫలితం వచ్చింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా.. బీఆర్ఎస్ అయినా ఏడాది కిందటి వచ్చిన ఫలితాల్ని.. అంతకు ముందు పరిస్థితుల్ని బేరీజుు వేసుకుని రాజకీయం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్క ఏడాదిలో వారికి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితులు కాలం తెచ్చి పెట్టింది మరి.