ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో రెండు పేర్లు రాజీనామా చేసిన వారివే వినిపిస్తూండగా.. మూడో పేరు సానా సతీష్ అనే వ్యక్తిది వినిపిపిస్తోంది. ఈయన నిజంగా ఎలాంటి వాడో కానీ ఆయనపై ఆంధ్రజ్యోతికి చాలా కోపం ఉంది. ఆయనను ఓ పవర్ బ్రోకర్ గా ఓ ఇమేజ్ ను ఆంధ్రజ్యోతి తెచ్చిపెట్టింది. వైసీపీ హయాంలోనూ చక్రం తిప్పారని…. ఇప్పుడు టీడీపీ హయాంలోనూ అదే పని చేస్చున్నారని అంటున్నారు. అయితే ఆయన పేరు ఇప్పుడు రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
సానా సతీష్ పలుకుబడి ఏమిటో టీడీపీ నేతలకూ అర్థం కావడం లేదు. కాకినాడకు చెందిన ఆయన.. కొంత కాలంపాటు విద్యుత్ శాఖలో పని చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులతో పరిచయాలు ఏర్పడటంతో.. ‘వ్యాపారం’ కోసం ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ గ్రూప్ కంపెనీల్లోనూ తొలినాళ్లలో సతీశ్ బాబు డైరెక్టర్‌గా పని చేసినట్లుగా తలుస్తోంది. ఈయన పేరు ఈడీ కేసుల్లో చాలా సార్లు వినిపించింది.
హైదరాబాద్‌లోని ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు చెందిన సుకేశ్ గుప్తాకు బెయిల్ సమకూర్చడం కోసం 2017 అక్టోబర్‌లో సతీశ్ బాబు ఢిల్లీ వెళ్లాడని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది. నాటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణతోపాటు సతీశ్ బాబుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఎమ్మార్ స్కాంలో మొయిన్ ఖురేషికి చెల్లింపుల వ్యవహారంలో కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్‌ను ఈడీ నిందితుడిగా చేర్చింది. నాటి సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్, ఖురేషీ మధ్య మెసేజీల్లో ప్రదీప్ కోనేరు, సతీశ్ బాబుల ప్రస్తావన ఉంది. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో, అంతకు ముందు ఈడీ కేసులో సతీశ్ పేరు ఉంది.
అయితే ఎప్పుడూజైలుకు వెళ్లింది లేదు.కానీ ఆయన గత ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచారని చెబుతారు. టిక్కెట్ కేటాయించలేకపోవడంతో ఇప్పుడు రాజ్యసభ స్థానం ఇస్తున్నారని చెబుతున్నారు.