కాలం గిర్రున తిరుగుతూ ఉంటుంది. ఎంత వేగంగా అంటే ఒకప్పుడు కన్యాశుల్కం ఇచ్చేవాళ్లు.. తర్వాత అమ్మో అమ్మాయా అని భయపడేంత కట్నకానుకుల కాలం వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే కన్యాశుల్కం కనిపిస్తోంది. ఎంతగా ఈ పరిస్థితి ఉందంటే అమెరికాలో మంచి జాబ్‌లో స్థిరపడిపోయిన వారికీ పిల్ల దొరడం లేదు. దీనికి కారణం అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల డిమాండ్స్ ను .. అంచనాలను అందుకునే వరుళ్లు తగ్గిపోవడమే. విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
నాలుగు పదులకు దగ్గర పడుతున్నా పెళ్లి కాని ఎన్నారైలు ఎందరో !
నిరంజన్ ( పేరు మార్చాం ) అమెరికాలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగి. ఎలా లేదన్నా.. ఏడాదికి ఓ రూ.50 లక్షలకుపైగానే కళ్ల జూస్తాడు. అమెరికాలో మంచి ఇల్లు ఉంది. హై ఎండ్ టెస్లా కారు ఉంది. డబ్బుపరంగా చింత లేని లైఫ్. కానీ అతనికి ఒకటే కష్టం..ఏమిటంటే పెళ్లి కాలేదు. ఎందుకంటే వచ్చిన సంబంధాలన్నీ .. ఆయనకు సొంత రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఆస్తి లేకపోవడం. భూమిలేకపోవడం. సొంత రాష్ట్రంలో ఆస్తులు లేకపోతే ఎన్నారైకి అయినా పిల్లను ఇచ్చేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. చేసేది లేక..తన సేవింగ్స్ మొత్తాన్ని పెట్టి హైదరాబాద్ లో ఓ లగ్జరీ ఇల్లు కొని దాన్ని చూపించి పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకుటున్నాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఎవర్ని పెళ్లి చేసుకున్నా కట్నం పైసా కూడా రాదన నిరంజన్‌కు క్లారిటీ ఉంది.
ఎన్నారై పెళ్లి కొడుకులకు ఇలాంటి ఎన్నోఅనుభవాలు !
ఒక్క అమెరికా మాత్రమే కాదు ఆస్ట్రేలియా, కెనడా,లండన్ఇలా అనేక దేశాల్లో కీలక పొజిషన్లలో ఉండి పెళ్లి కాని ప్రసాదుల ప్రధాన సమస్య సొంత రాష్ట్రంలో ఆస్తులు లేకపోవడం. చాలా మంది తల్లిదండ్రుల శ్రమతో.. కష్టపడి చదువుకుని బాగా చదువుకుని.. ఉద్యోగాల్లో ఎదుగుతున్నారు. వారికి సొంత గ్రామంలో ఇల్లు కట్టుకోగలరేమో కానీ సంపాదించిన మొత్తం పెట్టి పొలాలు, ఫ్లాట్లు కొనాలని అనుకోవడంలేదు. ఇప్పుడు అలాంటి ఆస్తులు లేకపోతే పిల్లలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణం అమెరికాలో ఉద్యోగాల తీసివేతలేనన్న కారణంఎక్కువగా వినిపిస్తోంది.
విదేశాల్లో ఉద్యోగం పోతే ఎలా అనే ప్రశ్న !
వధువుల తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇప్పుడు ఎన్నారై సంబంధం అంటే ఎగ్గైజ్ అయిపోవడం లేదు.ఖచ్చితంగా సొంత రాష్ట్రంలో ఆస్తులు ఉండాలి.. హైదరాబాద్‌లోని ఇల్లు ఉండాలి అని చూసుకుంటున్నారు. అమెరికాలో ఇల్లు.. టెస్లా కారు ఉదంంటే వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారుతోంది. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగం పోతే అక్కడ ఉండనీయరు.. అక్కడ ఇల్లు,కారుతో ఇక ఏం పని అనే ముందస్తు ఆలోచన ఎక్కువగా చేస్తున్నారు. ఈ ఫలితంగానే ఎన్నారై పెళ్లి కొడుకులకు పెళ్లిసంబంధాలు రావడం గగనం అవుతోంది. బాగాఆస్తులు ఉంటే అమెరికాలో కష్టపడాల్సిన అవసరం ఏముందని అనుకునేవారుకొందరు… అక్కడ కష్టపడి పెళ్లి కోసం ఇండియాలో ఆస్తులు కొనాల్సిన పరిస్థితిలో మరికొందరు.. ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారు.
చేతులెత్తేస్తున్న మ్యాట్రిమొనియల్ కంపెనీలు
ఇంతకు ముందు మ్యాట్రిమొనియల్ కంపెనీలకు ఎన్నారై సంబంధాలు కుదర్చడం చాలా ఈజీగా ఉండేది. అమెరికాలో ఉద్యోగం చేస్తే చాలు ఇక్కడ వారికి ఆస్తులు ఉన్నా లేకపోయినా పట్టించుకోకుండా సంబంధం ఖాయం చేసేవారు. ఇప్పుడు వధువుల తల్లిదండ్రుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు రావడంతో మాట్రిమొనియల్ కంపెనీలు కూడా సంబంధాలు కుదర్చడానికి కిందా మీదా పడుతున్నాయి. కాలం మారిపోతోంది మరి !