‘పుష్ప 2’ అంచనాలు ఆకాశానికి తాకేశాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో… మరింత హైప్ పెరిగిపోయింది. రాజమౌళి కూడా ‘పుష్ప 2’ని ఆకాశానికి ఎత్తేశారు. ఇక సినిమా చూడడమే తరువాయి. అల్లు అరవింద్ కూడా ఇండైరెక్ట్ గా ‘ఇది ఇండస్ట్రీ హిట్’ అంటూ హింట్ ఇచ్చినట్టు కనిపించింది. ప్రీ రిలీజ్ లో అల్లు అరవింద్ మాటలు వైరల్ అయ్యాయి. ‘పుష్ప2’ సినిమా చూశాక ఇంటికి వెళ్లాన అరవింద్ ని ‘మీ మొహం వెలిగిపోతోంది ఏమిటి’ అంటూ ఆయన సతీమణి అడిగారని, తన మొహం రెండే రెండు సందర్భాల్లో వెలిగిందని, ఒకటి ‘మగధీర’ చూశాక, రెండోది ‘పుష్ప 2’ చూశాక` అని అల్లు అరవింద్ వేదికపై చెప్పేశారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్. అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ తిరగరాసింది. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా అదే చేయబోతోందన్నది అల్లు అరవింద్ మనోగతం అయి ఉంటుంది. అందుకే ఆయన నర్మగర్భంగా ‘మగధీర’తో పోల్చారు. అరవింద్ జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాలేదు. ఆయన సినిమాని ప్రేక్షకుడి కోణంలోనే చూస్తుంటారు. మాస్ సినిమాలు ఆయనకు బాగా నచ్చుతాయి. అందుకే ‘పుష్ప 2’పై కూడా ఆయన జడ్జిమెంట్ నిజం అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. పుష్పకి ఇప్పటికే మంచి హైప్ ఉంది. దానికి తగ్గట్టుగా రెండు తెలుగు ప్రభుత్వాలూ టికెట్ రేట్ పెంచుకొనే వెసులుబాటు కల్గించాయి. తొలి రోజు రికార్డుల మోత మోగిపోవడం ఖాయం. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా, ‘పుష్ప 2’ని ఎవరూ ఆపలేరు.