కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ప్రియాంకా లోక్ సభలో ప్రమాణం చేశారు. గాంధీ కుటుంబం నుంచి ఇద్దరు లోక్ సభకు.. ఒకరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సోనియా రాజకీయ జీవితం ముగిసిపోగా.. రాహుల్ పూర్తిగా వైఫల్యాలతో సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఎంట్రీ ఇచ్చారు.
రెండు దశాబ్దాలుగా ఆమె పార్టీకి అంచెలంచెలుగా పని చేస్తూ వస్తున్నారు. మొదట ప్రచారాలు.. తర్వాత తల్లి, సోదరుడు నియోజవర్గాల బాధ్యతలు తీసుకున్నారు. చివరికి యూపీలో సగం ప్రాంతానికి ఇంచార్జ్‌గా పని చేశారు. అంతేనా ప్రధాన కార్యదర్శిగా పదవి కూడా తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ మాత మాత్రం మారడం లేదు. ఫైనల్ గా ప్రజా ప్రతినిధి అయ్యారు. ఇక నుంచి అయినా కాంగ్రెస్ సీన్ మారుతుందని సగటు కాంగ్రెస్ నేతలు ఆశ పడుతున్నారు.
ప్రియాంకా గాంధీ మొదట కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల బాధ్యతలు తీరిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెను చూస్తే పాత కాలం వాళ్లకు ఇందిరాగాంధీ గుర్తుకు వస్తారు. హావభావాల్లోనే కాదు .. మాట తీరులోనూ ఇందిరాగాంధీనే పోలి ఉంటారు. అంత పట్టుదల ఉన్న రాజకీయ నేత అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే అనుకోవచ్చు. వాయనాడ్‌లో చరిత్ర సృష్టించే విజయంతో ఆమె కొత్త కెరీర్ స్టార్ట్ చేశారు. రాహుల్ గాంధీతో ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రయోగాలు చేసింది. ఇక ముందు కూడా రాహుల్ తెర ముందు ఉండవచ్చు కానీ.. ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పక తప్పదు.
కాంగ్రెస్ వరుసగా పదిహేనేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటోంది, మరోసారి ఓడిపోతే శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న పార్టీ చరిత్రలో కలిసిపోతుంది. కాంగ్రెస్ ను కాపాడాలంటే.. ప్రియాంక చేతుల్లోనే ఉంది. రాహుల్ తో కలిసి ఆ పోరాటం చేయాల్సి ఉంది.