కొత్త గొంతుకల్ని పరిచయం చేయడం సంగీత దర్శకులకు మహా యిష్టం. వాయిస్ కొత్తగా ఉంటే పాట హిట్టయిపోతుంది. అయితే.. పాత గొంతుల్ని కొత్తగా పరిచయం చేయడం కూడా హిట్ ఫార్ములానే. ఇప్పటి సంగీత దర్శకులు అదే చేస్తున్నారు. సూపర్ హిట్ పాటలతో ఓతరాన్ని ఓ ఊపు ఊపేసిన రమణగోగుల స్వరాన్ని మళ్లీ వినిపించే ప్రయత్నం చేశారు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన ఈ సినిమాలోని తొలి పాట ‘గోదారి గట్టు’ బయటకు వచ్చింది. రమణ గోగుల ఈ పాట పాడుతున్నారనగానే `వినకుండానే హిట్` అయిపోయింది. ఇప్పుడు వినగానే ఇనిస్టెంట్ గా సూపర్ హిట్ అయిపోయిందీ గీతం. రమణ గోగుల గొంతు, ఆ ఆలాపన వింటే సంగీతాభిమానులకు ఒకప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. అప్పటికీ ఇప్పటికీ ఆయన గొంతులోని వైవిధ్యం అలానే ఉంది. దానికి తగ్గట్టుగా భాస్కరభట్ల రవికుమార్ హుషారైన పదాల్ని జోడించారు. భార్యా భర్తల చిలిపి సరసాన్ని సరదాగా వర్ణించారు.
”విస్తరి ముందెట్టి, పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే”
”గంపెడు పిల్లలతో ఇంటిని నింపావే
చాపా దిండుతో సంసారాన్ని మేడెక్కించావే..”
”గురకెట్టీ పడుకోరే.. గుర్ఖాల్లాగా మీ వాళ్లు
ఏం చేస్తాం ఇలాగే ఎక్కేస్తాం డాబాలూ” అంటూ మామూలు మాటలతోనే శృంగారాన్ని ఒలికించారు భాస్కరభట్ల. ట్యూన్ సింపుల్ గా ఉన్నా, ఇనిస్టెంట్ గా ఎక్కేస్తుంది. చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. వెంకటేష్, ఐశ్వర్యల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. `ధమాకా` సినిమాతో భీమ్స్ పేరు మార్మోగిపోయింది. ఓ పెద్ద హీరో సినిమా చేతిలో పడడంతో ఇంకాస్త శ్రద్ధగా పని చేసినట్టు అనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.