మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ నేతపై కీలకమైన సెక్షన్ల కింద హైదరాబాద్ పంజాగుట్టలో కేసులు నమోదు అయ్యాయి. బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయింది. ఇందులో హరీశ్ రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై.. క్రైం నెంబర్ 1205/2024 సెక్షన్ 120 (b), 386, 409,506r/w34IPC and 66 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని. .. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్‌గౌడ్ పిర్యాదు చేశారు.
కొన్నాళ్ల క్రితం చక్రధర్ గౌడ్ ఓ స్వచ్చంద సంస్థను పెట్టి సిద్దిపేట నియోజకవర్గంలో విస్తృతగా పర్యటించేవారు. ఓ సారి రైతు కుటుంబాలు వంద మందికి రూ. లక్ష చొప్పున రూ. కోటి ఇచ్చారు. ఇలా వినూతనంగా కార్యక్రమాలు చేపడుతూ రైతుల కోసమే అన్నట్లుగా ఆయన రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే హఠాత్తుగా ఆయనపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని.. డబ్బులు వసూలు చేసి మోసం చేశారని కేసులు నమోదయ్యాయి. దాంతో ఆయన రాజకీయ జీవితం అక్కడితో ఆగిపోయింది. చాలా మంది ఆయన తప్పు చేశారనే అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఆయన తనపై పెట్టింది అక్రమ కేసులు అని తన ఫోన్ ట్యాపింగ్ చేసి మరీ ఈ పనికి పాల్పడ్డారని ఆయన గుర్తించారు. ఇప్పటికి ఆయనకు ధైర్యం రావడంతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు విస్తృతమవుతోంది. ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఆ పనికి పాల్పడిన అసలు అప్పటి ఉన్నతాధికారి అమెరికాలో సెటిలైపోగా… ఇక్కడ చాలా మంది ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు.