వైకాపా నేతలు అంబటి రాంబాబు, రోజా, వాసిరెడ్డి పద్మావతి, కరణం ధర్మశ్రీ తదితరులు నిన్న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావుపై పిర్యాదు చేశారు. ఆయన ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2014 ఎన్నికలలో తను రూ. 11.5 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నవారు రూ. 28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి వీలులేదు. ఆయన స్వయంగారూ. 11.5 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పారు గనుక ఆయనపై అనర్హత వేటు వేయాలని వారు ఎన్నికల అధికారిని కోరారు.
అయితే ఈ నిబంధనని ఏ రాజకీయ పార్టీ కానీ నేతగానీ పట్టించుకోరనేది బహిరంగ రహస్యమే. ఎన్నికల సంఘానికి కూడా ఆ విషయం తెలుసు కానీ ఏమీ చేయలేని నిసహాయ స్థితి. పూర్తి సాక్ష్యాధారాలుంటే తప్ప ఎవరినీ ప్రశ్నించే సాహసం కూడా చేయలేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరిపైనా చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు.
కోడెల శివప్రసాదరావుపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తున్న వైకాపా నేతలు కూడా ఎన్నికలలో అంతకంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టారని అందరికీ తెలుసు. నిజానికి రూ.11.5 కోట్లు అంటే ఇప్పుడు చాలా చిన్న మొత్తమే అనుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు వందల కోట్లు పెట్టుబడి పెట్టగల కార్పోరేట్ సంస్థల యజమానులకి, పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకి, విద్యా వైద్య వ్యాపారాలు చేసుకొనే బడాబాబులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే టికెట్లు కేటాయిస్తున్నాయి. ఒక పార్టీ తరపున కోట్లు కుమ్మరించగల వ్యక్తిని అభ్యర్ధిగా నిలబెడితే, అతనిని ఎదుర్కొని గెలవడానికి అంతకంటే బలమైన అభ్యర్ధిని ఇతర పార్టీలు నిలబెట్టక తప్పడం లేదు. చివరికి అందరూ కలిసి రాజకీయాలకి, వ్యాపారానికి మధ్య ఉండే గీతని కూడా చెరిపేసి, ఎన్నికలని కూడా పెద్ద జూదంగా మార్చేశారు.
డా. కోడెల శివప్రసాదరావు నోరుజారి ఆ విషయం బయటపెట్టుకోవడం వలననే వైకాపాకి ఈ అవకాశం కలిగిందని చెప్పవచ్చు. దాని వలన ఆయన స్వయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి రావడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా ఊహించని సమస్య తెచ్చిపెట్టారు. అయితే ఇంతకంటే తీవ్రమైన పిర్యాదులనే చెత్తబుట్టలో పడేసిన ఎన్నికల సంఘం, అధికారంలో ఉన్న పార్టీకి చెందిన శాసనసభ స్పీకర్ పై వైకాపా ఇచ్చిన పిర్యాదుని పట్టించుకొంటుందని ఆశించలేము.