హైదరాబాద్ నగర వాసులకు కొత్త సినిమా అంటే ప్రసాద్ మల్టీప్లెక్సే గుర్తొస్తుంది. ప్రతి శుక్రవారం అక్కడ నెలకునే సందడే వేరు. అలాంటి ప్రసాద్ ఐమాక్స్ లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘పుష్ప 2’ని ప్రదర్శించలేదు. రెవెన్యూ షేర్ లో మైత్రీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, ప్రసాద్ మల్టీప్లెక్స్ కు డీల్ కుదరలేదు.
పుష్ప డిస్ట్రిబ్యూటర్లు సినిమాకి వున్న క్రేజ్ దృష్ట్యా 55 శాతం రెవెన్యూని మల్టీప్లెక్స్ లు చెల్లించాలని నిర్ణయించారు. డిస్ట్రిబ్యూటర్లు అడిగిన పెర్సెంట్ ని చెల్లించడానికి ప్రసాద్ తప్పితే అన్ని మల్టీప్లెక్స్ లు అంగీకరీంచాయి. ప్రసాద్స్ మాత్రం తాము రెగ్యులర్ గా చెల్లించే 52.5 శాతం వాటానే ఇస్తామని చెప్పింది. వాటా విషయంలో చాలా చర్చలు జరిగాయి. అయితే ఎవరూ రాజీ పడలేదు. దీంతో ప్రసాద్స్ లో పుష్ప2 ప్రదర్శన జరగలేదు. ఒక డీలింగ్ లో పట్టు విడుపులు వుంటాయి. కానీ మైత్రీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు, ప్రసాద్ మల్టీప్లెక్స్ మధ్య రాజీకుదరక పోవడం చర్చనీయంశంగా మారింది.
అయితే ఇక్కడ సమస్య కేవలం పర్సంటేజ్ ది కాదు. పుష్ప డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పర్సంటేజ్ కి అన్ని మల్టీప్లెక్స్ లు అంగీకరించాయి. కేవలం ప్రసాద్ కే మినహాయింపు ఇస్తే మిగతా మల్టీప్లెక్స్ లో ఖచ్చితంగా రివర్స్ అవుతాయి. రిలీజ్ టైం లో అలాంటి ఇష్యూ నిర్మాతలకి రావడం అంత మంచిది కాదు. దీంతో పుష్ప పంపిణీదారులు పట్టువీడలేదు.
ఇక ప్రసాద్ కూడా తమ నిబంధనలకు చాలా తీవ్రంగా కట్టుబడింది. ప్రతి క్రేజ్ ఉన్న సినిమా కూడా పర్సంటేజ్ ని వాళ్ళకి అనుకూలంగా డిసైడ్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో తమ బిజినెస్ కి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించింది. దీంతో సినిమాని ప్రదర్శించకపోవడమే తమ వ్యాపారానికి మంచిదనే నిర్ణయానికి వచ్చింది.
ప్రసాదం మాక్స్ చాలా పాపులర్ మల్టీప్లెక్స్. మిగతా మల్టీప్లెక్స్ లతో పోల్చుకుంటే స్నాక్స్ రేట్స్ రీజనబుల్ గా వుంటాయి. ఫస్ట్ డే సినిమా చూసే వాళ్ళకి ప్రసాద్స్ ఫస్ట్ ఆప్షన్. అలాంటి ప్రసాద్స్ లో పుష్ప2 లాంటి క్రేజీ సినిమా లేదు. అక్కడ స్క్రీన్స్ అన్నీ పాత సినిమాలతో వెలవెలబోతున్నాయి. ఇది ప్రసాద్స్ నష్టాన్ని మిగిల్చే చర్యే.
అటు పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ పై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ప్రసాద్స్ లో సినిమా లేకపోవడంతో దాదాపుగా 80 లక్షల వరకూ ఎఫెక్ట్ పడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ పుష్ప2 లాంటి క్రేజీ సినిమా విడుదలైన సందర్భంలో ప్రసాద్ ఐమాక్స్ అలా ఖాళీగా కనిపించడం మూవీ లవర్స్ కి ఓ వెలితి.