తెలంగాణ తల్లి విగ్రహం రూపులేఖలు బయటకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ కుమార్తె కవితను పోలి ఉందన్న విమర్శలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో.. దొరల అహంకారానికి గుర్తుగా ఉందని ఆరోపిస్తూ వచ్చారు. ఆయన అన్నట్లుగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్దం చేయిస్తున్నారు.
తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.అయితే విగ్రహం మాత్రం ఇంకా ఆవిష్కరించాల్సిన చోటుకు చేరలేదు.విగ్రహాన్ని ఎక్కడ తయారు చేయిస్తున్నారో కూడా ఎవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. విగ్రహ రూపురేఖలు కూడా బయటకు తెలియడం లేదు. ఇప్పటికే రేవంత్ మూడు,నాలుగు సార్లు వెళ్లి పరిశీలించి వచ్చారని చెబుతున్నారు.
తాము సిద్ధం చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి చేయిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించడం ఖాయమే.ఇప్పటికే కిరీటం, కలశం లేకుడా రూపొందిస్తున్నారన్న సమాచారం రావడంతో.. అన్నపూర్ణ లాంటి తెలంగాణను బీదరాష్ట్రానికి ప్రతీకగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడా తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ నేతలు ప్రయోగించడం ఖాయమే.రేవంత్ ఎలా ఎదుర్కొంటారన్నది కీలకం.