ఆంధ్రప్రదేశ్ యువతలో స్కిల్ సెన్సెస్ వంటి వినూత్న ఆలోచన చేస్తున్న ప్రభుత్వం తాజాగా.. వారి స్కిల్స్ పెంచేందుకు గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. అమరావతిలో గూగుల్ కు చెందిన అత్యున్నత స్థాయి బృందం నారా లోకేష్‌తో సమావేశం అయింది. ఈ సందర్భంగా గూగుల్ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య లోకేష్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
దీంతోపాటు స్టార్టప్ లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఎఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఎఐ&ఎంఎల్ సొల్యూషన్స్ ను ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుంది.
AI ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ, వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. స్కిల్ సెన్సెస్ తర్వాత ఎవరికి ఎలాంటి శిక్షణ అవసరమో గుర్తించడం తేలిక కాబట్టి.. ఈ ఒప్పందం యువతకు ఎంతో మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.