ఏపిలో వైకాపా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు మరిచిపోకుండా ఆయన కుమారుడు నారా లోకేష్ పేరుని కూడా చేరుస్తుంటారు. తెదేపా నేతలు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో జగన్ అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తుంటారు. వైకాపా నేతలు కూడా సరిగ్గా అదే విధంగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరినీ కలిపే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. రాజధాని భూముల నుంచి సదావర్తి భూముల వరకు ప్రతీ దానిలో పెద్దబాబు, చిన్నబాబు హ్యాండ్ ఉందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు విజయవాడలో పంజా సెంటర్ లో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అధ్వర్యంలో ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ (నిత్యావసర సరుకులు) పంపిణీ కార్యక్రమం జరిగింది. దానిలో పాల్గొన్న నారా లోకేష్ వైకాపా నేతల ఆరోపణలపై చాలా ఘాటుగా స్పందించారు. “ప్రతిపక్ష నేత (జగన్మోహన్ రెడ్డి) లాగ నాకు తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్ళాలని లేదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు. వాటిని నిరూపించి చూపితే నేనే జైలుకు వెళ్లి కూర్చోంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 64 ఏళ్ల వయసులో కూడా 16 ఏళ్ల పిల్లాడిలా చాలా హుషారుగా రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తుంటే ఆయనకీ సహకరించవలసినది పోయి అడుగడుగునా అడ్డుపడుతున్నారు,” అని లోకేష్ విమర్శలు గుప్పించారు.
తెదేపా నేతలు, మంత్రులు బినామీ పేర్లతో రాజధాని భూములని కొన్నారని వైకాపా ఆరోపించింది. దానిపై స్పందించిన మంత్రి నారాయాణ వైకాపా నేతలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత వైకాపా నేతలు ఆ భూముల గురించి మాట్లాడలేదు. మంత్రిగారు పరువు నష్టం దావా వేయలేదు.
మళ్ళీ ఇప్పుడు సదావర్తి సత్రవ భూములని తెదేపా నేతలు కొట్టేశారని వైకాపా ఆరోపిస్తోంది. వాటిలో చినబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కనుక ఆ ఆరోపణలు నిరూపించమని లోకేష్ సవాలు చేస్తున్నారు. బహుశః కొన్ని రోజుల తరువాత ఈ వ్యవహారం గురించి అందరూ మరిచిపోయి వేరే వ్యవహారం గురించి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవచ్చు.
దీనిని బట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే అధికార పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేయడం వరకే వైకాపా ఆసక్తి కనబరుస్తుంది తప్ప కోర్టుకి వెళ్లి దానిని నిరూపించే ప్రయత్నం చేయదని స్పష్టం అవుతోంది. అంటే రాజకీయ దురుదేశ్యంతోనే ఆరోపణలు చేస్తున్నట్లు అనుమానించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ తమపై అంత తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పుడు అది తప్పని నిరూపించుకొనే ప్రయత్నం తెదేపా ఎన్నడూ చేయ(లే)దు. కేవలం ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల నోళ్ళు మూయించాలని ప్రయత్నిస్తుంటుంది. అదే..ధైర్యంగా వాటిపై ప్రభుత్వం విచారణకి ఆదేశించి ఉంటే ప్రతిపక్షాలకి గట్టి సమాధానం చెప్పినట్లుండేది. కానీ ప్రతిపక్షాలు కోరినా సరే ఏనాడూ అందుకు అంగీకరించదు. అంటే వాటి ఆరోపణలలో ఎంతో కొంత నిజముందని నమ్మక తప్పదు. చివరికి అర్ధం అవుతున్నదేమిటంటే ఈ విమర్శలు, ఆరోపణలు, ప్రతివిమర్శలు అన్నీ కూడా ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయాయి తప్ప ఏవీ నిరూపించబడవు. ఎవరి అవినీతి భాగోతాలు బయటపడే అవకాశాలే ఉండవని.