ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మైక్రోసాఫ్ట్ సంస్థ నందిగామ వద్ద పాతిక ఎకరాల భూమిని రూ. 181 కోట్లుపెట్టి కొనుగోలు చేసినట్లుగా జాతీయ మీడియా చెబుతోంది. నందిగామ అమరావతి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ రెండు బడా ఫార్మా కంపెనీలకు భూమి ఉంది. వారి వద్ద నుంచి మైక్రోసాఫ్ట్ భూమి కొనుగోలు చేసినట్లుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆదారంగా పాప్ స్టాక్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటి వరకూ ఏపీలో పెట్టుబడులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనీసం ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మైక్రోసాఫ్ట్ సంస్థ అడిగితే ప్రభుత్వమే అమరావతి లేదా విశాఖపట్నంలో భూమి ఇస్తుంది.. తమ ఆఫీసును ఏర్పాటు చేయడానికి రాయితీలు కూడా ఇస్తుంది. కానీ గత సెప్టెంబర్లోనే మైక్రోసాఫ్ట్ సైలెంట్ గా భూమి కొనుగోలు చేసిందన్న విషయం బయటకు రావడం సంచలనంగా మారింది.
ఆ స్థలం కొనుగోలు చేయడంలో మైక్రోసాఫ్ట్ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆ స్థలంలో మైక్రోసాఫ్ట్ ఎలాంటి ఆఫీసులు పెట్టాలనుకుంటోందో కూడా ఎవరికీ తెలియదు. మొత్తంగా ఏపీలో మైక్రోసాఫ్ట్ ల్యాండ్ కొనుగోలు చేసిన అంశం మాత్రం హాట్ టాపిక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.