గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు వరుసగా జైలు పాలవుతున్నారు. వంశీని నమ్ముకుని చేసిన అడ్డోగలు పనుల దెబ్బకు కేసులు మీద పడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి చేసి రణరంగం సృష్టించిన కేసులో వంశీ పీఏ సహా పలువురు ముఖ్య అనుచరుల్ని పోలీసులు తాజాగా అరెస్టులు చేశారు. గతంలో కొంత మందిని అరెస్టు చేశారు. వైసీపీ క్యాడర్ అంటే ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు చేసిన వారే కావడంతో అందరూ కటకటాల వెనక్కి పోతున్నారు.
వైసీపీలో చేరిన తర్వాత వంశీ చేయని అరాచకం లేదు. టీడీపీ కార్యాలయంపై కుట్ర ప్రకారం దాడి చేశారు. తగలబెట్టేశారు. లోకేష్ ఓ సారి విద్యార్థులతో మాట్లాడుతూంటే… లైవ్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇలాంటి పిల్లిబిత్తర పనులు బయటకు రానివి చాలా చేశారు. అవన్నీ ఇప్పుడు అనుచరుల మెడకు చుట్టుకుంటున్నాయి. వారంతా జైలు పాలవుతున్నారు. వారి కుటుంబాలు వేదనకు గురవుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు అనుచరుల్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసిన వంశీ ఇప్పుడువారికి అండగా ఉండకుండా పరారయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు. గన్నవరం వస్తే తనపైన దాడి చేస్తారేమోనన్న భయంతో ఆయన బతుకుతున్నారు. కోర్టు వాయిదాలకు మారు వేషాల్లో వస్తున్నారు. వంశీ పరిస్థితి చూసి గన్నవరంలో .. ఎలాంటోడు ఎలా అయిపోయాడని సెటైర్లు వేసుకుంటున్నారు.