సాక్షి పత్రికకు కొత్త ఎడిటర్ వచ్చారు. ఆయన పేరు ధనుంజయ్ రెడ్డి. ఈ ధనుంజయ్ రెడ్డి .. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంవోను భ్రష్టుపట్టించారని వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి కాదు. రిటైరైపోయిన ఆయనను సాక్షి ఎడిటర్ గా నియమించారేమోనని చాలా మంది అనుకున్నారు కానీ.. ఈ ధనుంజయ్ రెడ్డి వేరు.
సజ్జల రామకృష్ణారెడ్డిలాగే ఈనాడులో కెరీర్ ప్రారంభించారు ధనుంజయ్ రెడ్డి. కాకపోతే ఆయన అంత సీనియర్ కాదు. సాక్షి పత్రిక ప్రారంభం తర్వాత ఈనాడు నుంచి సాక్షిలో చేరారు. పులివెందులకు చెందిన ఈయన.. భారతిరెడ్డి బంధువర్గానికి చెందిన వారని చెబుతారు. రెండుతెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అసలు ఎడిటర్ ను అలా ఉంచి రెండు రాష్ట్రాలకు ఇద్దరు రెసిడెంట్ ఎడిటర్లను నియమించారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. భారతిరెడ్డికి పరిచయస్తుడు, బంధువు అయిన కారణంగా ఆయనకు ఏపీలో రెసిడెంట్ ఎడిటర్ పోస్టు ఇచ్చారు. కొన్నాళ్లకే తీసేశారు. ఎందుకంటే బోలెడన్ని దందాలు చేస్తున్నారని ఆయన సేవలు ప్రభుత్వంలో అవసరం అని సలహాదారు పదవి ఇచ్చారని చెబుతారు.
ఇటీవల వర్దెల్లి మురళి అనే కమ్యూనిస్టు జర్నలిస్టు సమయం అయిపోయిందని రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో తీసేసిన రెసిడెంట్ ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిని పూర్తి స్థాయి ఎడిటర్ గా నియమించారు. ఆయన నియామకంపై సాక్షిలోనే సెటైర్లు పడుతున్నాయి కానీ.. ఎవరూ నోరెత్తలేరు. ఈ ధనుంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్నికూడా పెద్దగా లెక్క చేయరు. నేరుగా భారతి రెడ్డికి రిపోర్టు చేస్తారు. అంటే పత్రికపై సజ్జల పట్టు తగ్గిపోయిందని అనుకోవచ్చు.