ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ అనగానే ఎగిరి గంతేశారు నందమూరి అభిమానులు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ దర్శకుల్లో ప్రశాంత్ ఓ స్టార్. తనది లక్కీ హ్యాండ్. సూపర్ హీరో కథలతో పాన్ ఇండియా హిట్ కొట్టి.. మంచి పునాది వేసుకొన్నాడు. కథలతో ఏదో మ్యాజిక్ చేస్తాడన్న నమ్మకం తనపై ఉంది. అందుకే ఫ్యాన్స్ సంబర పడ్డారు. డెబ్యూకి సరైన దర్శకుడు దొరికాడనుకొన్నారు. అయితే ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ కథని పక్కన పెట్టిన మోక్షజ్ఞ ప్రస్తుతం ఆదిత్య 999పై ఫోకస్ పెట్టాడు. దీనికి బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం.
నిజానికి బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు, అందులోనూ ఆదిత్య 369 సీక్వెల్ తో అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. సడన్గా… ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కించేసరికి ఆదిత్య 999 ని పక్కన పెట్టారు. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడానికి కారణం ఓ రకంగా ప్రశాంత్ వర్మనే. ఎందుకంటే తను ఇంకా పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయలేదని టాక్. తన దగ్గర కేవలం రేఖామాత్రమైన కథే ఉందని, బౌండెడ్ స్క్రిప్టు ఇవ్వలేదని తెలుస్తోంది. `నాపై నమ్మకం ఉంచండి.. నేను హిట్ సినిమా చేతిలో పెడతా` అని ప్రశాంత్ వర్మ చెప్పినా, బాలయ్య ఎందుకో వినడం లేదని టాక్ నడుస్తోంది.
మరోవైపు మోక్షజ్ఞ కూడా డోలాయమానంలో ఉన్నాడని తెలుస్తోంది. మోక్షజ్ఞకు ముందు నుంచీ సినిమాలు, నటనపై పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. తనకు ఇంకొంచెం టైమ్ కావాలని అడుగుతున్నాడట. నటనలో సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకొన్నప్పటికీ – మోక్షు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని ఇన్ సైడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా కథ సిద్ధం చేయడంలో తాత్పర్యం చేయడంతో ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లింది. బాలయ్యతో ఆదిత్య 999 సీక్వెల్ కి ముహూర్తం నిర్ణయించినా, దాన్ని కూడా వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మోక్షు డెబ్యూ కాస్త ఆలస్యమయ్యేలానే కనిపిస్తోంది.