అమరావతిపై అన్ని హక్కులూ సింగపూర్ వే!
సిఆర్ డిఎ అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం?
ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించే సంస్ధలో రాష్ట్రప్రభుత్వ సంస్ధ అమరావతి డెవలప్ మెంట్ కంపెనీ భాగస్వామి అయినా కూడా అన్ని అధికారాలూ సింగపూర్ సంస్ధలకే కట్టబెట్టడం పట్ల సిఆర్ డిఎ – కేపిటల్ రీజియన్ డెవలప్ మెంటు అధికారులు అభ్యంతరాలు చెబుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో ఏసమస్యలకు దారితీస్తుందో అన్న ఆందోళన వారిలో వుంది.
రాజధాని నిర్మించే కన్సార్టియమ్ కు భూములపై జిపిఎ(జనరల్ పవర్ ఆఫ్ ఆధరైజేషన్) ఇచ్చే డాక్యుమెంటేషన్ ను పరిశీలిస్తుండగా సింసపూర్ సంస్ధలే సర్వాధికారులన్న నిబంధనను చేర్చారని బయటపడింది. ఈ క్లాజు ప్రకారం భూములపై సర్వహక్కులతోపాటు వ్యాపారం చేసుకునే అధికారం సింగపూర్‌కు చెందిన అసెండాస్- సెంబ్‌కార్ప్ సింగ్‌బ్రిడ్జ్ కన్సార్టియానికే ఇచ్చారు. భూములను దేశ, విదేశీ బ్యాంకుల్లో ఎక్కడైనా తాకట్టు పెట్టుకునే వీలు కల్పించారు. .
మొదటి విడత ఇచ్చే 50 ఎకరాలకు ధర నిర్ణయించాలా ? వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదు. మిగిలిన భూములను కూడా సింగపూర్ కంపెనీ అడిగిన సమయానికి వారికి ఇవ్వాలి. లేకపోతే దానికయ్యే పరిహారాన్ని భాగస్వామిగా ఉండే అమరావతి డెవలప్ మెంటు కంపెనీ – ఎడిసి చెల్లించాల్సి ఉంటుంది. తొలిదశలో ఇచ్చే 50 ఎకరాలను అభివృద్ధి చేసే క్రమంలో ఒకవేళ బయట సంస్థలకు ఇవ్వాలనుకుంటే ధరను నిర్ణయించే హక్కు సింగపూర్ కంపెనీదే!
ఎవరితో ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటారు అనే విషయంపైనా ఎడిపికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనే విధంగా షరతులున్నాయని సిఆర్డిఏ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై సిఆర్డిఏ అధికారుల్లోనూ వ్యతిరేకత వస్తోంది.
షరతుల్లో పేర్కొన్న అంశాల ప్రకారం సింగపూర్ కన్సార్టియానికి కేటాయించే భూముల ధరలను వారి సూచనల ప్రకారమే నిర్ణయించాల్సి ఉంటుంది. వారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే సమయంలో ప్రభుత్వం నుండిగానీ సిఆర్డిఏ నుండిగానీ ఎటువంటి అనుమతులూ అవసరం లేని విధంగా షరతులు రాసుకున్నారు.
నాలుగుదశల్లో కేటాయించనున్న 1691 ఎకరాల భూముల్లో ఉండే ప్రభుత్వ ఆస్తులు, ఇతర వస్తువులన్నీ ప్రభుత్వమే తొలగించుకోవాలని, కన్సార్టియానికి ఎటువంటి సంబంధమూ ఉండదని పేర్కొన్నారు. ఒకసారి భూమి కేటాయించిన తరువాత అది పూర్తిగా కంపెనీ హక్కుగా మారుతుందని, దీన్ని వెనక్కు ఇచ్చే అవకాశమూ ఉండబోదనే నిబంధనను చేర్చారు. ఆ భూముల్లో పరిశ్రమలకు రావడానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు, నీరు. విద్యుత, శానిటేషన్, రోడ్లు వంటి సదుపాయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అభివృద్ధి చెందే వరకూ ఎవరికీ అనుమతులివ్వకూడదు సింగపూర్ సంస్థలకు కేటాయించిన భూములకు 25 కిలోమీటర్ల పరిధిలో ఎడిపి అనుమతి లేకుండా ఏ పరిశ్రమా ఏర్పాటు చేయడానికి వీల్లేదు. కేవలం సర్వీసు రంగానికి సంబంధించిన సంస్థలకు మాత్రమే అనుమతివ్వాల్సి ఉంటుంది. అవి కూడా అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసేవే ఉండాలని మరో షరతు విధించినట్లు తెలిసింది.
25 కిలోమీటర్ల దూరంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమగానీ, సంస్థగానీ ఏర్పాటు చేయాలనుకుంటే దాని ప్రభావం కన్సార్టియంకు కేటాయించే ప్రాంతంపై పడదని ప్రభుత్వమే స్పష్టమైన హామీనివ్వాల్సి ఉంటుంది. ఇది సరైన పద్దతి కాదని సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలిసింది. వారు నిర్మించే కంపెనీల్లోకి స్థానికుల ప్రవేశానికి అనుమతులు లేని విధంగా నిబంధనలున్నాయి. అలా రాకుండా చూడాల్సిన బాధ్యత, కంపెనీలకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత హోంశాఖదేనని నిబంధనల్లో పేర్కొన్నారు.