ఎన్నికలకు ముందు విశాఖ పోర్టుకు వచ్చిన ఓ షిప్లో డ్రై ఈస్ట్ పేరుతో పెద్ద ఎత్తున కోకైన్ వచ్చిందని దాని విలువ వేల కోట్లు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ కేసు ఏమయిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ కేసులో అసలు డ్రగ్స్ లేవని తాజాగా స్పష్టత వచ్చింది. వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసిందని. కంటైనర్ షిప్లో ఎటువంటి డ్రగ్స్ లేవని నిర్దారణ అయిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని కోర్టుకు సీబీఐ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
గత మార్చిలో బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో డ్రగ్స్ ను పట్టుకున్నట్లుగా సీబీఐ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ముఠాల్ని పట్టుకోవడానికి.. ఈ రాకెట్ ను చేధించడానికి ఆపరేషన్ గరుడ ను సీబీఐ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిఘా పెట్టినప్పుడు విశాఖ పోర్టుకు పెద్ద ఎత్తున డ్రగ్స్ పంపిస్తున్నట్లుగా సమాచారం తెలిసింది. దీంతో నిఘా పెట్టిన సీబీఐ అధికారులు షిప్ వైజాగ్ పోర్టుకు రాగానే పట్టుకున్నారు.
బీర్‌ను తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల గింజలను ఎగుమతి చేసినట్లుగా పత్రాలు సృష్టించారు. ఒక్కో బ్యాగులో ఇరవై ఐదు కేజీల చొప్పున మొత్తం వెయ్యి బ్యాగుల్లో ఇరవై ఐదు వేల కేజీల సరుకును పంపినట్లుగా పత్రాల్లో ఉంది. నార్కోటిక్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు.. ఈ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బీరు తయారు చేసే గింజలతో పాటు పెద్ద ఎత్తున ఇతర డ్రగ్స్ పదార్దాలును కూడా సరఫరా చేసినట్లుగా గుర్తించారు. మొత్తం కన్ సైన్ మెంట్ ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అయితే పరీక్షల్లో అది డ్రైఈస్ట్ గానే నిర్దారించినట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై.. వైసీపీ నేతలు..టీడీపీ నేతలపై ఆరోపణలు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు నాలిక కరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.