మెట్రో సిటీలను పక్కన ద్వితీయశ్రేణి నగరాలను చూస్తే ఇళ్ల డిమాండ్, ధరల పెరుగుదలలో గుంటూరు ఓ రేంజ్ లో ఉందని తాజాగాతేలింది. ప్రాప్ ఈక్వీటీ సంస్థ చేసిన ఎనాలసిస్లో ఇళ్ల ధరల పెరుగుదలలో గుంటూరు టాప్ లో ఉంది. గతేడాదితో పోలిస్తే గుంటూరులో ఇంటి సగటు ధర ఏకంగా 51 శాతం పెరిగిందని గుర్తించింది. విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలో మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానం, బలమైన డిమాండ్ వంటి అంశాలతో ధరలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు ఎందుకు హాట్ టాపిక్ గా మారిందంటే.. అమరావతి కారణం అని అనుకోవచ్చు. ఏపీలో ప్రభుత్వం మారడంతో అక్కడ అమరావతి నిర్మాణం జోరందుకోనుంది. అందుకే అక్కడ కొనుగోలుకు అన్ని ప్రాంతాల ప్రజలు ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారని అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో గుంటూరు నగరం చుట్టూ పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తున్నాయి. అనుమతులు ఉన్నాయా లేవా అన్న పరిశీలన లేకుండా కొనేస్తున్నారు. ఈ కారణంగా డిమాండ్ పెరుగుతోంది.
గుంటూరు నగరం విస్తరణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతూండటంతో వెంచర్లుగానే ఉంటున్నాయి.. ఇళ్ల నిర్మాణాల వరకూ వెళ్లడం లేదు. గత ఆరు నెలలుగా పరిస్థితి మెరుగుపడుతోంది. ఇప్పుడు డిమాండ్ అక్కడే ఉండటంతో ప్రభుత్వం మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు కల్పిస్తే గుంటూరు ద్వితీయ శ్రేణి నగరాల్లోనే మరింత గొప్పగా ఎదిగే అవకాశం ఉంది.