బాక్సాఫీసు దగ్గర పుష్ప రాజ్ వసూళ్ల జాతర చేసుకొంటున్నాడు. కొంతమంది కావాలని నెగిటీవ్ టాక్ సృష్టిస్తున్నా, వసూళ్ల ప్రభంజనం ఆగడం లేదు. ఎక్కడ చూసినా రికార్డుల మోతే. అయితే.. ఈ సినిమా వసూళ్లపై పైరసీ కొంత వరకూ ప్రభావం చూపిస్తోంది. రిలీజ్ రోజే మంచి క్వాలిటీతో పైరసీ ప్రింటు బయటకు వచ్చేసింది. ప్రముఖ పైరసీ సైట్లలో పుష్ప 2 దర్శనమిస్తోంది. కొంత వరకూ చిత్రబృందం పైరసీని కంట్రోల్ చేసింది కానీ, పూర్తి స్థాయిలో ఆపడం సాధ్యం కావడం లేదు. పెరిగిన టికెట్ రేట్లు సామాన్యుడికి ఈ సినిమాని దూరం చేసిందన్నమాట వాస్తవం. దానికి తోడు పైరసీ అందుబాటులో ఉంది. ఈ కారణాల వల్ల… వసూళ్లలో కొంత మేర ప్రభావం కనిపించింది.
చాలా థియేటర్లలో శుక్రవారం నుంచి టికెట్ రేట్లు తగ్గించారు. దాంతో ఫుట్ ఫాల్స్ పెరిగాయి. శుక్రవారం నైట్ షోలు ఫుల్ అయ్యాయి. శని, ఆదివారాలు మళ్లీ థియేటర్లు కళకళ లాడే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే అడ్వాన్సు బుకింగులు జరిగిపోయాయి. పుష్ప 2 ఎలా ఉన్నా, నెగిటివ్ టాక్ ఉన్నా `ఓసారి చూసేద్దాం` అని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. దాంతో టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లు నిండుతున్నాయి. శుక్రవారం చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించాలనుకొంది. అయితే చివరి నిమిషంలో వాయిదా వేశారు. శనివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ జరుగుతోంది. ఇదే మీట్ శుక్రవారం పెడితే కాస్త బాగుండేది. కానీ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, ఓ మహిళ మృతి చెందడంతో చిత్రబృందం కాస్త కలవరపాటుకు గురైంది. బాధిత కుటుంబాన్ని ఆదుకొన్న తరవాతే… సంబరాలు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి పాతిక లక్షల పరిహారం ప్రకటించారు. అందుకే శనివారం సక్సెస్ మీట్ పెట్టారు.