‘పుష్ప’ విజయంలో శ్రీలీల భాగం కూడా ఉంది. ఎందుకంటే ఇందులో తాను ఓ ఐటెమ్ గీతం చేసింది. ఆ పాట మాస్కి నచ్చిందా, లేదా ఫ్లోలో.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిందా, అనేది పక్కన పెడితే… తన ఖాతాలో ‘పుష్ప 2’ అనే సినిమా చేరిపోయింది. ‘పుష్ప 2’ గురించి ఎప్పుడు మాట్లాడుకొన్నా, శ్రీలీలను కూడా ప్రస్తావించుకోవాల్సిందే. ఈ పాటలో కొన్ని మూమెంట్స్ శ్రీలీల బాగా చేసింది. డాన్సింగ్ క్వీన్ అని తనని ఎందుకు అంటారో.. మరోసారి నిరూపించుకొంది.
అయితే.. ఐటెమ్ సాంగ్ చేయడం శ్రీలీలకు ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా కావొచ్చు. ఇక మీదట ప్రత్యేక గీతాలకు దూరంగా ఉండాలని శ్రీలీల భావిస్తోంది. ఓ కథానాయిక ఐటెమ్ పాట చేస్తే, ఆ పాట హిట్టయితే, ఇక మీదట అలాంటి అవకాశాలే వస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ సొమ్ము చేసుకొనే వీలుంది. కానీ ‘ఐటెమ్ గాళ్’ అనే ముద్ర పడిపోతుంది. ఈ బ్రాండ్ వేసుకోవడం శ్రీలీలకు ఏమాత్రం ఇష్టం లేదు. ‘పుష్ప 2’కి ముందు కూడా కొన్ని ప్రత్యేక గీతాల్లో శ్రీలీలకు ఆఫర్లు అందాయి. కానీ సున్నితంగా తిరస్కరించింది. చిరంజీవి `విశ్వంభర`లో ఓ ఐటెమ్ గీతం ఉంది. అందుకోసం ముందుగా సంప్రదించింది శ్రీలీలనే. కానీ తాను ‘నో’ చెప్పింది. పుష్ప2కి ఉన్న క్రేజ్, అల్లు అర్జున్తో డాన్స్ చేయాలన్న కోరిక వల్ల… ‘పుష్ప 2’ పాటలో నర్తించడానికి అంగీకరించాల్సివచ్చింది. ‘ఈ పాట క్లిక్ అయినా, అవ్వకపోయినా.. ఇక మీదట ఐటెమ్ పాటలు చేయను’ అని శ్రీలీల ముందే డిసైడ్ అయ్యిందని, తన దగ్గరకు ఇలాంటి ఆఫర్లు వస్తున్నా, ఎంత పారితోషికం ఇస్తామన్నా అస్సలు కేర్ చేయడం లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. తాను కథానాయికగా నటించిన ‘రాబిన్ వుడ్’ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. వరుస ఫ్లాపుల మధ్య మళ్లీ తాను ట్రాక్ లోకి రావాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టడం తప్పనిసరి.