ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున మంత్రి ప్రతినిధిగా వస్తూంటే వద్దని చెప్పలేరు కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకున్నాయి. గౌరవంగా ఆయన ఆహ్వానాన్ని తీసుకున్నారు. పర్సనల్ గా ఏమైనా మాట్లాడారేమో కానీ.. ఈ అంశంపై కేసీఆర్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.ఆయన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వెళ్లడం అసాధ్యం అనుకోవచ్చు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ మరో రూపంలో తయారు చేయించారు. కానీ దానికి అధికారిక ముద్ర వేయలేకపోయారు. ఆ విగ్రహం తెలంగాణ భవన్ లోనే ఉంటుంది. కానీ రేవంత్ ఆ తెలంగాణ తల్లి విగ్రహం దొరల పాలనకు ప్రతిరూపంలా ఉందని బహుజన తెలంగాణ తల్లిని సిద్దం చేయిస్తానని ప్రకటించారు. ఆ మేరకు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి ఆవిష్కరిస్తున్నారు. కానీ ఈ విగ్రహ నమూనాను బీఆర్ఎస్ అంగీకరించడం లేదు. అందుకే ఈ కార్యక్రమానికి కేసీఆర్ కాదు కదా ఆ పార్టీకి చెందిన వారెవరూ హాజరయ్యే అవకాశం లేదు.
నిజానికి ఇలాంటి కార్యక్రమాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునో రాజకీయానికి సంబంధం రోజునో.. లేకపోతే ప్రజాపాలన వియోత్సవాల్లో భాగంగా కాకుండా విడిగా నిర్వహించినా బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యేవారేమో కానీ ఇప్పుడు జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విజయోత్సవాలు. ఇందులో పాల్గొనేందుకు మరో పార్టీ ప్రతినిధులు ఆసక్తి చూపరు. అయితే ప్రభుత్వ ఆహ్వానాలను తిరస్కరించడం సంప్రదాయం కాదు కాబట్టి కేసీఆర్, కిషన్ రెడ్డి ఆహ్వానాలను గౌరవంగా తీసుకున్నారు. గతంలో అమరావతికి అంగీకారం తెలిపినా జగన్ మాత్రం ఇన్విటేషన్ తీసుకునేందుకు కూడా నిరాకరించారు.