టీంకు క్రెడిట్ ఇవ్వడంలో సుకుమార్ రూటే వేరు. ఏదో గౌరవార్థం అన్నట్టుగా కాకుండా మనస్పూర్తిగా ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేస్తుంటారు సుక్కు. పుష్ప 2 కి సంబధించి ఇప్పటివరకూ సుకుమార్ మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో సమయం కుదరలేదు. ఈ రోజు సక్సెస్ మీట్ లో ఆయనకు కావల్సినంత సమయం దొరికింది.
ఈ ఈవెంట్లో తన క్రెడిట్ ఇవ్వడానికి చాలా సమయాన్ని వెచ్చించారు సుక్కు. మొత్తం టీంని వేదికపైకి పిలిచారు. ఒకొక్కరిని ముందుకు పిలిచి వారు చేసిన వర్క్, వారి ప్రతిభ, ప్రత్యేకతని చెప్పి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని షేర్ చేశారు. సుక్కు అలా టీం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటే వినడానికి ముచ్చటగా అనిపించింది. `ఈ సినిమాకు నేను దర్శకుడ్ని కాదు.. వీళ్లంతా దర్శకులే. పొరపాటున నా పేరు వేసుకొన్నా` అని సుకుమార్ చెప్పడం ఆయన సభ్యతకు, సంస్కారానికీ నిదర్శనం.
పుష్ప మామూలు సినిమా కాదు. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన సినిమా తీసినప్పుడు ఏ దర్శకుడైన ఇంత సమయం కేటాయించి టీం వర్క్ ని గుర్తు చేసుకోవడం చాలా అరుదు. ‘టీంకి థాంక్ యూ. ఇదంతా టీం ఎఫెర్ట్’ అని పొడిపొడి మాటలతో సరిపెడతారు. కానీ సుక్కు ఇంత నిజాయితీగా అందరికీ క్రెడిట్ ఇవ్వడం రియల్లీ సూపర్బ్.
ఇప్పటికే సుకుమార్ వద్ద పని చేసిన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు పుష్ప వేదికపై సుకుమార్ పరిచయం చేసిన వారిని చూస్తుంటే మరో 20 మంది దర్శకులైన ఆయన ద్వారా తెలుగు సినిమాకి కానుక వస్తారన్న ఆశ కలుగుతోంది.