జగన్ రెడ్డిని నమ్మి అడ్డగోలు పనులు చేస్తే జీవితం అక్కడితో ఆగిపోతుంది. ఓ ముద్ర మొహంపై పడుతుంది. ఆ ముద్ర ఎలాంటిదంటే.. వీడు దొంగరా బాబూ దగ్గరకు రానివ్వకూడదు అని ప్రతి ఒక్కరిని హెచ్చరించేలా ఉంటుంది. జగన్ మెప్పు కోసంఅధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అడ్డగోలు పనులు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు అంతే. పోనీలే పోస్టింగుల కోసం తప్పుడు పనులు చేశారు ఇప్పుడు మారుతారు అని ఓ అవకాశం ఇద్దామని ప్రభుత్వ జాలి చూపినా… బయట నుంచి వచ్చే రెస్పాన్స్ తో అలాంటి అవకాశం లేకుండా పోతోంది.
తాజాగా బియ్యం అక్రమ రవాణాపై వేసిన సిట్ లో ముగ్గురు వీఆర్ లో ఉన్న డీఎస్పీలకు చోటిచ్చారు. వీరు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగా చేశారు. ఇష్టారీతిన అధికార దుర్వినియోగం చేశారు. వారు చేసిన పనులకు టీడీపీ నేతలు ఎంతో నష్టపోయారు. దర్శి అసెంబ్లీ సీటును కోల్పోవడానికి అశోక వర్థన్ రెడ్డి అనే డీఎస్పీ కారణం అనే అభిప్రాయం బలంగా ఉంది. ఈయనతో పాటు మరో ఇద్దరు డీఎస్పీలకు పోస్టింగులు లేవు. ఖాళీగా ఉన్నారు కదా అని .. బియ్యంపై వేసిన సిట్ లో నియమించారు. కానీ వీరిని నియమిస్తే వైసీపీకే పని చేస్తారని మీడియాలో ప్రచారం కావడంతో వారిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు.
వారిపై ప్రభుత్వ పెద్దలు సానుభూతి చూపినా.. బయట నుంచి వచ్చే స్పందనతో ముందడుగువేసే పరిస్థితి లేదు. తాత్కలిక పోస్టింగుల కోసం అడ్డగోలు పనులు చేసిన అధికారులు తమ సర్వీస్ అంతా ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగాన్ని ఉద్యోగంలా చేసి.. నిజాయితీగా ఉండి ఉంటే ఇవాళ కష్టాలు ఎదురైనా రేపు గుర్తింపు వస్తుంది. కానీ అడ్డగోలుగా పని చేస్తే పని చేసినప్పుడే కాదు..తర్వాత కూడా సమస్యలు ఎదుర్కోవాలి. ఆ డీఎస్పీలకు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది.