వెట్రిమారన్ అనగానే మట్టివాసన గట్టిగా తగులుతుంది. అనగారిన వర్గాల కథల్ని, వాళ్ల వ్యధల్నీ తెరపైకి తీసుకొస్తారాయన. కథల్లో మలుపులు, పాత్రల ప్రవర్తన అన్నీ షాకింగ్ గా ఉంటాయి. ఆ షాకింగ్ వాల్యూనే వెట్రిమారన్‌కు ప్రత్యేకమైన పేరు తీకొచ్చింది. వెట్రి మారన్ దర్శకత్వంలో రూపొందిన ‘విడుదల’ మంచి విజయాన్ని అందుకొంది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు ‘విడుదల 2’ రెడీ అయ్యింది. ఈనెల 20న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
వెట్రిమారన్ కథలు, అందులో ఆయన సృష్టించిన పాత్రలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘విడుదల 1’ చూసిన వాళ్లకు ‘విడుదల 2’ ఏ టెంపోలో సాగుతుందో వివరించాల్సిన అవసరం లేదు. ‘విడుదల 1’ ఎక్కడ ముగిసిందో, అక్కడే ఈ కథ మొదలైంది. ఈసారి విజయ్‌సేతుపతి పాత్రని హైలెట్ చేశాడు వెట్రిమారన్. డైలాగులు, ఎమోషన్స్… అలజడి పుట్టించేలా ఉన్నాయి. వెట్రిమారన్ మార్క్ డ్రామా ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది. ఈసారి యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్టు అనిపిస్తోంది. ఆ యాక్షన్ కూడా రియాలిటీకి దగ్గరగా డిజైన్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. పార్ట్ 1లో కూడా చాలా సన్నివేశాల్ని ఇళయరాజా సంగీతం ఎలివేట్ చేసింది. ఈసారి పార్ట్ 2లో ఇళయరాజా ఓ పాట కూడా పాడారు. అనురాగ్ కశ్యప్, గౌతమ్ మీనన్, సూరి, మంజు వారియర్…ఇలా కాస్టింగ్ కి ఢోకా లేదు. విజయ్ గెటప్ కూడా బాగా సెట్టయ్యింది. ‘పుష్ప’కి సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప 2’ ఘన విజయం సాధించిన ఈ నేపథ్యంలో తమ సీక్వెల్ కూడా ఆదరణ పొందుతుందన్న నమ్మకం నిర్మాతల్లో ఉంది. చింతపల్లి రామారావు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.