‘పుష్ప’ తో జాతీయ అవార్డు సాధించిన అల్లు అర్జున్, పుష్ప 2లో మరింత విశ్వరూపం చూపించాడు. నిజానికి నటుడిగా పుష్ప 1 కంటే 2 లోనే బన్నీకి ఎక్కువ మార్కులు పడతాయి. ఆ పాత్రలో అంతగా ఇమిడిపోయాడు. మరీ ముఖ్యంగా జాతర సీన్లో అయితే పూనకాలు తెప్పించాడు. ఓ మాస్ హీరోపై అలాంటి సీన్ రాయడం, అందులో బన్నీ లాంటి స్టార్ విజృంభించడం… చాలా అరుదుగా చూసే విషయాలు. మొత్తానికి అల్లు అర్జున్ నటన, పుష్ప 2 కోసం తాను పడిన కష్టం.. బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ ని పొగుడుతూ చేసిన ఓ ట్వీట్ నేషనల్ వైడ్ గా వైరల్ అవుతోంది.
ఈమధ్య బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన బన్నీ అమితాబ్ బచ్చన్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. అమితాబ్ తనకు ఆదర్శమని, తనని చూసి చిత్రసీమలో ఎంతోమంది హీరోలు వచ్చారని, ఇండియన్ సినిమాకు అమితాబ్ బచ్చన్ రియల్ ఐకాన్ అంటూ కీర్తించాడు. ఆ వీడియోని బిగ్ బీ రీ ట్వీట్ చేస్తూ.. బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. ”మీరు నన్ను అర్హతను మించి పొగిడేశారు. మీ కష్టానికి, ప్రతిభకు నేను పెద్ద అభిమానిని. మీరు ఇలానే మరెన్నో విజయాల్ని సాధించాలి” అని ఆకాంక్షించారు బిగ్ బీ. అమితాబ్ నుంచి ఇలాంటి ట్వీట్ బన్నీ కూడా ఊహించలేదు. ”మీరు మా సూపర్ హీరో. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం నమ్మలేకపోతున్నా. మీ ప్రేమకు ధన్యవాదాలు” అంటూ అమితాబ్ కు రిప్లై ఇచ్చాడు బన్నీ. అమితాబ్ దృష్టిలో పడడం అంటే మామూలు విషయం కాదు. అమితాబ్ చాలా తక్కువ సందర్భాల్లో ఇలా ట్వీట్లు చేస్తుంటారు. అందుకే ఈ ట్వీట్ ఓ అవార్డుతో సమానం.
బాలీవుడ్ లో పుష్ప 2 కలక్షన్లు ఉధృతంగా ఉన్నాయి. హిందీ సినిమా కలక్షన్లకు మించిన అంకెలు కనిపిస్తున్నాయి. ఆదివారం రూ.80 కోట్ల వరకూ గ్రాస్ సాధించింది. ఏ హిందీ సినిమా చేయలేని మ్యాజిక్ ఇది. టోటల్ రన్ పూర్తయ్యేసరికి కేవలం బాలీవుడ్ లోనే రూ.500 కోట్లకుపైగానే సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి.