వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు తేల్చింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని.. తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగా ఆయనకు రూ.30 లక్షల జరిమానా విధించింది. నెల రోజుల్లో ఆయనపై న్యాయపోరాటం చేసిన వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది.
చెన్నమనేని రమేష్ 1999 ఎన్నికల సమయంలో జర్మనీ నుంచి వచ్చి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆయన తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు కమ్యూనిస్టు దిగ్గజం. అయితే రాజకీయ భవిష్యత్ కోసం రమేష్ టీడీపీలో చేరి గెలిచారు. అప్పటికే ఆయన పౌరసత్వం వివాదం ఉంది. కమ్యూనిస్టుల కుటుంబాల్లోని పిల్లలు గతంలో యూఎస్ఎస్ఆర్కు వెళ్లి సెటిలయ్యేవారు. ఇలా వెళ్లిన రమేష్ అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. జర్మనీ మహిళనే వివాహం చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన ఇండియాలో ఉండేది తక్కువ. జర్మనీలో ఉండేది ఎక్కువ. ఆయన అందుబాటులో ఉండరని తెలిసినప్పటికీ కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చేవారు. గెలుస్తూ వచ్చేవారు. ఇటీవల ఎన్నికల్లో మాత్రం ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కానీ వెంటనే ఓ నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇండియా పౌరుడు కాదని కోర్టు తేల్చింది. అయితే ఇది న్యాయపరంగా ఎన్నో ఏళ్లు సాగింది. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి మరికొంత కాలం ఆలస్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తానికి వ్యవస్థలో ఉన్న లోపాలతో జర్మనీ పౌరుడైన వ్యక్తి మన దేశంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు.