జనసేన పార్టీకి ఖాళీగా ఉన్న మంత్రి పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.ఆ ఖాళీగా ఉన్న మంత్రి పోస్టు ఎవరికి ఇస్తారో అన్నదానిపై మొదట్లో చర్చ జరిగింది. తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు నాగబాబుకు ఖరారు చేశారు. అయితే కేబినెట్లో పవన్ కల్యాణ్ ఉండగా ఆయన సోదరుడ్ని తీసుకోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.ఆ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియక కాదు. కానీ ఆయన ప్లాన్లు ఆయనకు ఉన్నాయని అంటున్నారు. అదేమిటంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం.
ఢిల్లీపైనే పవన్ గురి
పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో జాతీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపైనా గళమెత్తుతున్నారు. హిందూత్వ వాదిగా ఆయనకు దేశవ్యాప్త ఇమేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన స్థానికంగా కంటే ఢిల్లీలో ఉంటే మంచిదని బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చలు జరిగాయని చెబుతున్నారు.
ఎంపీగానే పోటీ చేయాలని గతంలో అమిత్ షా సూచన
ఎన్నికల సమయంలో టిక్కెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కల్యాణ్ బహిరంగంగానే తెలిపారు.కానీ ఇప్పట్లో ఇంట గెలవాలన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చిన జాతీయ స్థాయి ఇమేజ్ .. తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర చోట్ల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్న ఎన్డీఏ పెద్దల వ్యూహం, పవన్ భావజాలం అన్నీ కలిపితే ఢిల్లీలో ఉండాలన్న వాదన వినిపిస్తోంది.
పవన్ ఢిల్లీకి వెళ్తున్నందునే నాగబాబుకు పదవి ?
పవన్ .. కేంద్రంలోకి వెళ్లారని నిర్ణయించుకున్నందున నాగబాబుకు కేబినెట్ లో పదవి ఖరారు చేశారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో జనసేన పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదు. పూర్తిగా పవన్ కల్యాణ్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. నాగబాబు కేబినెట్లోకి చేర్చుకోవడం అన్నది ఆషామాషీగా కాదని ఓ వ్యూహం ప్రకారం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.