కామెడీ ఈజ్ కింగ్. కమెడీయన్లూ కింగులే. ఓ సినిమా క్లిక్కయి, వాళ్ల కామెడీ పండితే – ఇక చూసుకోవాల్సిన పని లేదు. చేతినిండా సినిమాలు, కావల్సినంత రెమ్యునరేషన్. అయితే ఇందులో స్టార్ హోదా కొంతమందికే వస్తుంది. ప్రస్తుత కమెడియన్లలో ఆ హోదా సత్యకి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమధ్య టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కూడా తనదే. ఇటీవల ‘మత్తువదలరా 2’తో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు. ఈ సినిమా సత్య కెరీర్లో మ్యాజిక్ చేసింది. అంతకు ముందు వరకూ సత్య పారితోషికం రోజుకు రూ.లక్ష, లేదంటే లక్షన్నర అంతే. ‘మత్తు వదలరా’ తరవాత తన పారితోషికం ఏకంగా రూ.3.5 లక్షలు. అంత ఇస్తానన్నా ఇప్పుడు అందుబాటులో లేడు. అంత బిజీగా మారిపోయింది.
సత్య హీరోగా కొన్ని సినిమాలు పట్టాలెక్కాల్సింది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి. కారణం.. సత్య ఊపిరి సలపనంత బిజీగా మారిపోవడం. రోజుకి రెండు మూడు ఫిఫ్టుల్లో పని చేస్తున్నాడు సత్య. అదే హీరోగా ఓ సినిమా ఒప్పుకొంటే, దానికే కమిట్ అవ్వాలి. మిగిలిన సినిమాలు పక్కన పెట్టేయాలి. హీరోగా చేశానన్న తృప్తి మినహాయిస్తే డబ్బులూ పెద్దగా గిట్టవు. అదే కమెడియన్ గా సినిమాలు చేసుకొంటూ వెళ్తే వీలైనన్ని ఎక్కువ సినిమాలు కవర్ చేయొచ్చు, పారితోషికమూ ఎక్కువ అందుకోవొచ్చు. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా, పెద్ద పెద్ద సంస్థలు సినిమాలు తీయడానికి ముందుకు వచ్చినా, సత్య తన తెలివితేటలతో వాటిని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం కమెడియన్ పాత్రలకే పరిమితం అవుతున్నాడు. నిజంగా ఇది తెలివైన నిర్ణయమే.