సర్దార్తో మంచి హిట్ కొట్టిన దర్శకుడు మిత్రన్. ఆ తరవాత తెలుగులో ఓ సినిమా చేయాలని భావించారు. ఓ స్క్రిప్టు రెడీ కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవితో ఓసారి భేటీ అయ్యారు. చిరుకి లైన్ నచ్చింది. డవలప్ చేయమన్నారు. ఆయనేమో చిరు కోసం కథని రెడీ చేసే పనిలో పడిపోయారు. అయితే చిరు ఇప్పుడు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు ఆఫర్ ఇచ్చారు. అంతకు ముందు.. అనిల్ రావిపూడి సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే చిరు – మిత్రన్ కాంబో ఇప్పట్లో సాధ్యమవ్వడం కష్టమే.
మరోవైపు మిత్రన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. చిరుని ఎలాగైనా కలిసి కథ వినిపించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నానిపై కూడా మిత్రన్‌కు గురి ఉంది. నానితో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. చిరు ఒకవేళ ‘నో’ అంటే.. ఆ కథని కాస్త అటూ ఇటూ చేసి నానికి సెట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత మిత్రన్‌కు అడ్వాన్స్ ఇచ్చి, ఆఫీసు తెరచి, స్క్రిప్టు వర్క్ చేయించుకొంటున్నారు. స్క్రిప్టు సిద్ధమయ్యాక, హీరో అందుబాటుని బట్టి ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. ఈ ఇద్దరూ దొరక్కపోతే, మిత్రన్ ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే.. నాని కూడా ఇప్పట్లో దొరకడం కష్టమే. ఓ తమిళ దర్శకుడు, అందులోనూ హిట్ కొట్టిన దర్శకుడు తెలుగు హీరోల కోసం పడిగాపులు కాస్తున్నాడంటే… మన తెలుగు హీరోల స్టామినా అర్థం చేసుకోవొచ్చు.