మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై నిర్దాక్షణ్యంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మోహన్ బాబు వైఖరికి జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. జరిగిన దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు చట్టం కూడా తన పని తాను చేసుకొంటూ పోతోంది. జర్నలిస్టులపై దాడి చేసిన కారణంగా మోహన్‌బాబుపై పహడీ షరీఫ్ పోలీసులు బీఎన్ఎస్ 118 సెక్షన్‌కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్నులు కూడా స్వాధీనం చేసుకొన్నారు. నిజానికి మంగళవారం రాత్రి మోహన్‌బాబుని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సింది. కానీ ఆయనకు బీపీ పెరిగిందన్న కారణంతో అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ముందస్తు జాగ్రత్తగా మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరారన్న విమర్శలూ రేగుతున్నాయి. మోహన్‌బాబు డిశ్చార్జ్ అయితే.. అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయి యాక్షన్ మొదలెట్టే అవకాశం ఉంది.
మొత్తానికి మంగళవారం జరిగిన వ్యవహారాలు, మోహన్ బాబు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా కనిపించాయి. మంచు కుటుంబం ఒకొక్కటిగా జరిగిన ఉదంతాలు చూస్తుంటే మంచు కుటుంబం పరువు పూర్తిగా మంట కలిసేలా తయారైంది. ఈ టోటల్ వ్యవహారంలో మంచు లక్ష్మి ఎక్కడా కనిపించడం లేదు. ఆమె కూడా ఫైర్ బ్రాండే. తన జాడ లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. మనోజ్ అంటే లక్ష్మికి వల్లమాలిన అభిమానం. కష్టకాలంలో మనోజ్‌ని చేరదీసింది లక్ష్మీనే. ఇప్పుడు మనోజ్ వైపు మాట్లాడాలా, తండ్రి వైపు నిలబడాలా? అనే సందిగ్థతలో లక్ష్మి ఉందా, అందుకే బయటకు రావడం లేదా? అనే విషయాలపై మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.