మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్టు లోకం ఖండించింది. కాని నెటిజన్లు మాత్రం చాలా వయోలెంట్ గా స్పందిస్తున్నారు. టీవీ9 ప్రతినిధిపై దాడిచేయడం తప్పు కాదంటున్నారు. అక్కడ వ్యక్తిగతంగా టీవీ9 ప్రతినిధి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు. అతను ఏ విధంగానూ ఆ దాడికి బలవ్వాల్సిన వ్యక్తి కాదు. టీవీ9 ఇచ్చే న్యూస్ కవరేజీ మీద అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్య పద్దతిలో ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. దానికి దాడులు చేయడం అనేది పరిష్కారం కాదు.. అంతకు మించి నేరం కూడా.
టీవీ9 ప్రతినిధి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. కాస్త పైకి తగిలి ఉంటే అతని ప్రాణానికి ప్రమాదం. ఇప్పటికి కూడా అతనికి తేలిన దెబ్బలు చిన్నవి కావు. ఈ దాడిని సమర్థించడం అనేది మంచి పరిణామం కాదు. మోహన్ బాబు ఇష్యూపై ప్రజలకు ఆసక్తి లేకపోతే.. మీడియా కూడా ఎందుకు కవరేజీ ఇస్తుంది. అది వారి సొంత కుటుంబ మ్యాట్రిక్స్ కావొచ్చు కానీ రోడ్డు మీద కొట్టుకుంటే రిపోర్టు చేయరా ?.
సినిమా వాళ్లు బతికేది ప్రజల మీదనే. మరి వారి గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి ఉండదా ?. మీడియా కవరేజీ విషయంలో ఎవరూ మీడియా సంస్థలకు నైతికత బోధించాల్సిన పని లేదు. మీడియా సంస్థలు ఎన్నో సార్లు చాలా విషయాలను నైతికత కాదు అని డౌన్ ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి. మోహన్ బాబు విషయంలో మాత్రం చేస్తున్న కవరేజీ తప్పు అని ఎవరూ చెప్పలేరు. ఇవాళ మీడియాపై దాడిని సమర్థిస్తే.. అలా సమర్థించేవారు తమకు ఉన్న రక్షణను తాము తొలగించుకున్నట్లే.