రాజకీయ నేతలు ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటనే స్థితప్రజ్ఞత ఉందనుకుంటారు. మనసులో ఎంత కోపం.. కసి ఉన్నా బయటకు కనిపించకుండా సమయాన్ని చూసుకుని తమ పని తాము చేసుకెళ్లిపోవాలి. కానీ కేటీఆర్ మాత్రం ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతున్నారు. తాజాగా ఆయన టీవీ ఇంటర్యూల్లో మాట్లాడిన మాటల్ని, ఆవేశాన్ని చూసి సాధారణ రాజకీయకార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు.
ముఖ్యమంత్రిని పట్టుకుని హౌలాగాడు లాంటిపదాల్ని వాడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావాలి.. రేవంత్ చెప్పే మాటల్ని వినడానికి అని వాదిస్తున్నారు. కేటీఆర్ మరీ ఇంత ఎందుకు ఆవేసపడుతున్నారో ఆయనకే తెలియాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంత కంటే ఎక్కువగా మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం .. ఎక్కువగా ఆవేశపడుతున్నారు. ఓ రకంగా ఇది రేవంత్ వేస్తున్న ట్రాప్ ఏమో తెలియదు కానీ.. అదే నిజం అయితే కేటీఆర్ అందులో కూరుకుపోతున్నట్లే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ గట్టిగా భావిస్తోంది. ఇలాంటి సమయంలో మరింత తెలివిగా రాజకీయం చేయాలి కానీ.. ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ప్రజల్లో తమపైనే వ్యతిరేకత పెంచుకునేలా చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది. వింతవాదాలు.. వితండవాదాలు ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉండరనుకోవడం రాజకీయ అమాయకత్వమే !