జమిలీ ఎన్నికలపై కేంద్రం నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇదిగో బిల్లు పార్లమెంట్ లో పెట్టేస్తున్నామని అంటున్నారు. కానీ క్వశ్చన్ అవర్ కూడా సరిగ్గా జరగడం లేదు. ఇప్పుడుపార్లమెంట్ లో బిల్లు బెట్టి దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ బిల్లులను పాస్ చేయించుకోవడం దాదాపుగా అసాధ్యం.
మొత్తంగా ఆరు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని లా కమిషన్ తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ కూడా సిఫారసు చేసింది. కొన్ని పార్లమెంట్ సవరణలకు మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. అది ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించడం అసాధ్యం. లోక్ సభలోనే ఆ స్థాయి లేదు… సహకరించే పార్టీలు కూడా లేవు.ఎన్డీఏలో ఉన్న పార్టీలు తప్ప ఇతర పార్టీలు మద్దతుగా ఉండవు. రాజ్యసభలో అయితే సాధారణ మెజార్టీ కూడా కష్టమే.
అందుకే బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్ని పరోక్షంగా అయినా సహకరించమని కోరుతున్నారు. అంటే కనీసం ఓటింగ్ ను బాయ్ కాట్ చేసినా చాలని అనకుంటున్నారు. అందుకే ముందుగా బిల్లు పెట్టి వెంటనే ఓటింగ్ నిర్వహించకుండా.. విపక్షాలకు గౌరవం ఇచ్చేలా జేపీసీకి పంపాలని అనుకుంటున్నారు. తర్వాత అందరి మాటలు విన్నట్లుగా కొన్ని మార్పులు చేసి.. బిల్లు పాస్ చేయించుకోవాలనుకుంటున్నారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదని అనుకోవచ్చు.