పుష్ప ప్రాంచైజ్ అల్లు అర్జున్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. పుష్ప పాత్ర బన్నీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలబడిపోయింది. పుష్ప తర్వాత బన్నీతో ఎలాంటి సినిమా చేయాలి? ఎలాంటి పాత్ర రాయాలనే ఆలోచనలో పడిపోయారు ఫిల్మ్ మేకర్స్. ఎందుకంటే పుష్ప క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. పుష్పని మైమరపించే పాత్ర, కథని సిద్ధం చేయడం ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఓ సవాల్ అని చెప్పడంలో సందేహం లేదు. ముందుగా ఈ సవాల్ ని త్రివిక్రమ్ తీసుకుంటున్నారు.
బన్నీ, త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. సినిమాలతో అలరించారు. ఈ సినిమాలన్నీ కూడా తివిక్రమ్ మార్క్ ఎంటర్ టైనర్స్. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ముందున్న సవాల్ తన మార్క్ తో పాటు పుష్ప క్యారెక్టర్, క్రేజ్ ని మ్యాచ్ చేసే సినిమాని డిజైన్ చేయడం. ఈ విషయంలో ఒత్తిడి అంతా త్రివిక్రమ్ పైనే వుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే కాస్త సమయం తీసుకోని ప్రాజెక్ట్ ని డిజైన్ చేసేపనిలో వున్నారు.
బన్నీతో చేస్తున్న కథ, కాన్వాస్ ఇప్పటి వరకూ త్రివిక్రమ్ చేసిన సినిమాలకంటే చాలా పెద్దది. బేసిక్ గా త్రివిక్రమ్ కథల్లో మాటలు బలం ఎక్కువ. స్వతహాగా రచయిత కావడం వలన చాలా చోట్ల విజువల్ కంటే మాటకే ఎక్కువ ప్రాధన్యత ఇచ్చేస్తారాయన. దాదాపు ఆయన ఇంటర్వెల్ బ్యాంగ్స్, క్లైమాక్సులలో ఓ డ్రామాతో కూడిన మాటల మ్యాజిక్ వుంటుంది.
ఇప్పుడు బన్నీతో చేయబోతున్న సినిమా పాన్ ఇండియా రీచ్ కావాలి. త్రివిక్రమ్ అద్భుతమైన డైలాగ్ రైటర్. తెలుగు భాషలోని సొగసుని పట్టుకొని రాయడం త్రివిక్రమ్ కు పెన్నుతో పెట్టిన విద్య. ఐతే అయితే డైలాగ్ తో పాన్ ఇండియాని ఆకట్టుకోవడం కష్టం. తెలుగుని మరో భాషలోకి అనువదించినప్పుడు ఆ మ్యాజిక్ కుదరపోవచ్చు. అందుకే ఈ సినిమాని పూర్తిగా విజువల్ ప్రధానంగా డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు..బన్నీ క్యారెక్టరైజేషన్, గెటప్, భాష, యాస ఇలా అన్నిటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. మొత్తానికి పుష్ప క్రేజ్ ని మ్యాచ్ చేసే ఒత్తిడి ఇప్పుడు త్రివిక్రమ్ పై పడింది.