సినీయర్ హీరో మోహన్ బాబు కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. చాలా కాలంగా నలుగుతన్న మనస్పర్ధలు బహిరంగమయ్యాయి. ఆయన ఇంటి ముందు హైడ్రామానే నడుస్తోంది.
కుమారుడు మనోజ్, మోహన్ బాబు పరస్పరం పోలీసులకు పిర్యాదు చేసుకున్నారు. మనోజ్ తండ్రి తీరుని ఎండగడుతూ సుధీర్గ లేఖ రాశారు. ఇంటి ముందు జరిగిన అలజడిలో సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై అమానుషంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనపై కేసు కూడా నమోదైయింది.
ఇదే క్రమంలో మోహన్ బాబు ఓ వాయిస్ నోట్ ని రిలీజ్ చేశారు. దాదాపు పది నిమిషాల నిడివిగల ఈ వాయిస్ నోట్ లో కొన్ని కీలకమైన విషయాలు వున్నాయి.
మనోజ్ మోహన్ బాబుని కొట్టారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని మోహన్ బాబు చెప్పారు. అలాగే మోహన్ బాబు తన ఆస్తులు బిడ్డలకి రాసిచ్చారని మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది. కానీ ఇంకా ఆస్తులు ఇవ్వలేదని ఆయన మాటల ప్రకారమే అర్ధమౌతుంది. ”ఆస్తులు ముగ్గురికీ సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా.. లేదా.. దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం’ అని చెప్పారు మోహన్ బాబు.
అయితే ఈ ఆడియోలో అన్నిటికంటే ఓ కీలకమైన విషయం వుంది. మనోజ్ వ్యక్తిత్వం పై తండ్రి స్థానంలో వున్న మోహన్ బాబు చాలా తీవ్రమైన వాఖ్యలు చేశారు. మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడి చేస్తున్నాడు’ అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్ చర్చనీయంశంగా మారింది.
మనోజ్ కెరీర్ బాలేదనే మాట వాస్తవమే. దాదాపు సినిమాలు మానేశాడు. మొదటి పెళ్లి నిలవలేదు. రెండో పెళ్లి మోహన్ బాబుకు నచ్చలేదు. అయితే రెండో పెళ్లి తర్వాత మనోజ్ లో మార్పులు వచ్చాయి. కూతురు పుట్టింది. ఒక టీవీ షో చేశాడు. మిరాయ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సొంతగా సినిమాలు చేసుకోవాలనే ఆలోచన కూడా వున్నాడు.
ఇలాంటి సందర్భంలో స్వయంగా తండ్రి స్థానంలో వున్న మోహన్ బాబు.. తన బిడ్డ తాగుడుకి బానిస అని చెప్పడం మనోజ్ కెరీర్ కి ఎంతమాత్రం మంచిది కాదు.
ఈ వివాదం రేగినప్పటి నుంచి మనోజ్ ఒకటే మాట చెబుతున్నాడు -ఇది నా ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం అని. ఇప్పుడు మోహన్ బాబు వాఖ్యలు నిజంగా మనోజ్ ఆత్మ గౌరవాన్ని మంటగలిపేలానే వున్నాయి.