హైదరాబాద్ పాతబస్తీలో ఒకేసారి ఏకంగా 11మంది ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. హైదరాబాద్ పాతబస్తీలో తరచూ ఉగ్రవాదులతో సంబంధాలున్న ముస్లిం యువకులు పట్టుబడుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయమే. ఎన్.ఐ.ఏ. అధికారులు పోలీసులు కలిసి నిన్న పట్టుకొన్న 11మందిని విచారించిన తరువాత వారిలో ఆరుగురికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని భావించి విడుదల చేశారు. అది చాలా హర్షణీయం. ఉగ్రవాదులతో సంబంధాలు లేకపోయినా అనుమానంతో అమాయకులైన ముస్లిం యువకులను అరెస్ట్ చేసి వేధిస్తే వారికి లేని ఆలోచనలు కలిగించినట్లవుతుంది. ఆ వేధింపులు భరించలేక వారు ఉగ్రవాదంవైపు మళ్ళితే నష్టపోయేది మనమే. కనుక అమాయకులని విడిచిపెట్టడమే కాకుండా వారికి ఉగ్రవాదంతో వారికి ఎటువంటి సంబంధాలు లేవని, వారు అమాయకులని కేవలం అనుమానంతోనే ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకొన్నామని ఎన్.ఐ.ఏ., పోలీసులు అధికారికంగా ఒక ప్రకటన చేయడం కూడా చాలా అవసరమే. ఎందుకంటే వారిపై ఐసిస్ ముద్ర వేసింది వారే కనుక. వారు నిర్దోషులని పోలీసులు ప్రకటించినట్లయితే వారు మళ్ళీ యధావిధిగా రోజువారి జీవితాలు ఇబ్బందులు లేకుండా గడుపుకోగలుగుతారు. వారి కుటుంబం, ఉద్యోగాలు, చదువులపై ఈ ప్రభావం పడకుండా నివారించవచ్చు.
అదే సమయంలో హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకి, వారి సానుభూతిపరులకి అడ్డాగా మారకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కూడా ఉంది. తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలని ప్రయత్నిస్తుంటే, మరోపక్క దేశంలో ఏమూల ప్రేలుళ్ళు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ బయటపడుతుండటం ఆ ప్రయత్నాలకి చాలా విఘాతం కలిగిస్తాయి. కనుక ఉగ్రవాద నిరోధానికి ప్రత్యేక వ్యవస్థని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడం చాలా అవసరం. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే నగర పోలీస్ వ్యవస్థని చాలా పటిష్టం చేసి ఆధునీకరించింది. అంచలంచెలుగా నగరాభివృద్ధికి ప్రభుత్వం ఏవిధంగా కృషి చేస్తోందో, అదేవిధంగా ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థని కూడా ఆధునీకరించడం చాలా అవసరం. అప్పుడే ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాగలవు.