రాహుల్ గాంధీ అంటే కేటీఆర్కు చాలా నమ్మకం ఉంది. కాంగ్రెస్ అంటే ఇంకా చాలా గౌరవం ఉంది. చాలా మంచి కాంగ్రెస్ పార్టీ, అంతకు మించిన రాహుల్ ఇమేజ్ ను కేవలం రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తున్నారు. ఇది ఏ మాత్రం కేటీఆర్ కు నచ్చడం లేదు. చూడండి సార్ అని పదే పదే రాహుల్ గాంధీకి లేఖలు రాయడం.. ట్యాగ్ చేసి ట్వీట్లు చేయడం చేస్తున్నారు. కేటీఆర్ తీరు చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సొంత పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై ఇన్ని ఫిర్యాదులు తమ హైకమాండ్ కు చేయరని .. కానీ కేటీఆర్ మాత్రం మరింత జోరుగా ఉన్నారని సెటైర్లు వేసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ఇమేజ్ ను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో వీలైనంత పలుచన చేయడం కోసం కేటీఆర్ ఇలాంటి లేఖలు రాస్తున్నారని చెప్పక తప్పదు. ఈ ప్రయత్నాలు కేటీఆర్, కేసీఆర్ రేవంత్ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వక ముందు నుంచీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే పీసీసీ చీఫ్ రేసులో ఆయన ముందుకొస్తారో అప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆయనను క్రిమినల్ గా చూపించే ప్రయత్నం చేసారు. కానీ రేవంత్ పై హైకమాండ్ నమ్మకం ఉంచింది. దాన్ని రేవంత్ వమ్ము చేయలేదు.
అయినా కేటీఆర్ ఇప్పటికీ అదే ప్లాన్ అమలు చేస్తున్నారు. గాంధీ భవన్ లో గాడ్సే అని చెబుతున్నారు. ఆయన చేతకాని సీఎం లేఖలు రాస్తున్నారు. తెలంగాణ ఆగమైపోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన అనుకున్నంతగా లేదని.. ఆగమైపోతోంది బీఆర్ఎస్సేనని ఇలాంటి లేఖల ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంటుంది. ఎందుకంటే సొంత పార్టీ నేతలపై ప్రత్యర్థి పార్టీ నేతలు రాసే లేఖల్ని ఎవరైనా… గట్టిగా దెబ్బకొడుతున్నాడని అందుకే భయంతో రాస్తున్నారన్న అర్థంలోనే తీసుకుంటారు.కేటీఆర్కు ఈ మాత్రం అర్థం కాకపోవడమే అసలు సమస్య.