హైదరాబాద్లో హైరైజ్, లగ్జరీ అత్యంత భారీ ప్రాజెక్టులు చేపట్టే బడా రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు ఐదు గుర్తు చేసుకుంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు రాజపుష్ప. కోకాపేటలో భూముల వేలం పెడితే ఎకరం వంద కోట్లు కు అసువుగా స్థలాలు కొనేసింది. మొత్తం ఎనిమిది భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రాసెస్లోఉన్నాయి. కానీ కొద్ది రోజులుగా ఆ సంస్థ డెలివరీ ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయ. పనులు కూడా మందగించాయి. ఇప్పుడిప్పుడే వారికి అడ్వాన్సులు చెల్లించిన వారు బయటకు వచ్చి చెబుతూండటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రాజపుష్ప ప్రాపర్టీస్ ఐటీ కారిడార్, కోకాపేట, తెల్లాపూర్ లాంటి చోట్ల పెద్ద ఎత్తున లగ్జరీ ప్రాజెక్టులు చేపట్టింది. ఏడాది కిందటి వరకూ ఆ సంస్థకు తిరుగులేదు. డబ్బులకు కొదవలేదు అన్నట్లుగా ప్రాజెక్టులను ప్రారంభించింది. మార్కెట్ కూడా బాగుండటంతో .. బుకింగ్స్ కూడా బాగుంటాయన్న ఉద్దేశంతో ప్రారంభించారో.. ఆర్థిక వనరులకు ఇబ్బంది ఉండదని అంచనాతో ప్రారంభించారో కానీ… ఇప్పుడు అలా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో పనులు చేయడానికి లిక్విడ్ క్యాష్ సమస్యలను ఎదుర్కొంటోంది
ఆస్తుల ప్రకారం చూస్తే కంపెనీ చాలా బలంగా ఉంది. భారీ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అత్యంత ఖరీదైన ల్యాండ్స్ కంపెనీకి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆస్తులు ఉండటం కాదు… పనులు చేయడానికి లిక్విడ్ క్యాష్ ఉండాలి. అది లేదు. అందుకే ఓ ఖరీదైన ప్రాపర్టీని కొంత కాలం కిందట మరో సంస్థకు అమ్మినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి రెరా అప్రూవల్ ఇంకా రాకపోవడంతో నిధులు అందడం లేదు. మార్కెట్ వర్గాలు కూడా రాజపుష్ప పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.
రాజపుష్ప యాజమాన్యం సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి కుటుంబీకులు. ఎంపీగా పోటీ చేసిన ఆయన చాలా ఖర్చు పెట్టారని ఈ కారణంగా కూడా లిక్విడ్ క్యాష్ సమస్య తలెత్తిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సహజంగానే కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో రాజపుష్పకు వనరుల సమస్య ప్రారంభమయిందని అంటున్నారు. అదే సమయంలో మార్కెట్ మందగించడంతో ఇంకా సమస్యలు పెరిగాయి. అయితే సంస్థత ఆస్తులు, ఆర్థిక సామర్థ్యం బలంగా ఉన్నందున త్వరగానే లిక్విడ్ క్యాష్ సమస్యను పరిష్కరించుకుంటారని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.