రవితేజకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి మహాధన్, కుమార్తె.. మోక్షధ. మహాధన్ బాగా యాక్టీవ్ గా ఉంటాడు. తనకు సినిమాలంటే ఇష్టం. మహాధన్ త్వరలో హీరో అవుతాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే అంతకంటే ముందే మోక్షధ ఇండస్ట్రీలో అడుగు పెట్టేసింది. అది కూడా సహాయ దర్శకురాలిగా.
మోక్షధకు డైరెక్టన్ డిపార్ట్ మెంట్ అంటే ఆసక్తి ఉంది. దర్శకత్వంలో మెళకువలు నేర్చుకొనే పనిలో తను బిజీగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ఓ సినిమా కోసం తను సహాయ దర్శకురాలిగా పని చేస్తోందని టాక్. అంతేకాదు… మహాధన్ కూడా ఓ అగ్ర దర్శకుడి దగ్గర దర్శకత్వంలో శిక్షణ తీసుకొంటున్నాడని తెలుస్తోంది. మహాధన్ నటనతో పాటు, దర్శకత్వం కూడా నేర్చుకొంటున్నాడా, లేదంటే తాను కూడా దర్శకుడు కావాలని అనుకొంటున్నాడా? అనేది తెలియాల్సివుంది. రవితేజ కూడా డైరక్షన్ డిపార్ట్ మెంట్ లోనే పని చేశాడు. దర్శకుడు అవ్వాలనే చిత్రసీమకు వచ్చాడు. కానీ అనుకోకుండా నటుడయ్యాడు. ఆ తరవాత స్టార్ గా మారాడు. ఇప్పుడు అదే బాటలో వారసులు కూడా నడుస్తున్నారేమో మరి.
స్టార్ పిల్లలు డైరెక్షన్ నేర్చుకోవాలంటే విదేశాల్లో కోర్సులు చేసి వస్తారు. కానీ రవితేజ పిల్లలు అలా కాదు. ఇండస్ట్రీలోనే ఉంటూ.. అందరిలా, దర్శకుల దగ్గర సహాయకులుగా పని చేస్తూ సినిమాలోని సాధకబాధకాలు దగ్గరుండి చూస్తూ, నేర్చుకొంటున్నారు. ఈ విషయంలో రవితేజని మెచ్చుకోవాల్సిందే.