ఈమధ్య సిద్దార్థ్ ‘పుష్ప 2’ ఈవెంట్ పై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. పాట్నాలో ఈవెంట్ కు భారీఎత్తున అభిమానులు తరలి వచ్చారుకదా, అని ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో యాంకర్ సిద్దార్థ్ ని అడిగితే.. తింగరిగా సమాధానం చెప్పాడు. కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నా.. చూడ్డానికి జనం ఎగబడతారు కదా.. అంటూ ‘పుష్ప 2’ స్థాయిని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సిద్దూని తగులుకున్నారు. మరి నీ ఈవెంట్లకు ఎందుకు జనం రారు? నువ్వు జేసీబీ కంటే దారుణమా అంటూ కౌంటర్లు వేశారు. ఓ స్టార్‌ని చూడడానికి ఫ్యాన్స్ ఎగబడితే వాళ్ల అభిమానం నీ కళ్లకి కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. ఈ విమర్శల నేపథ్యంలో సిద్దార్థ్ కు తాను చేసిన పొరపాటేంటో అర్థమయ్యి ఉంటుంది. అందుకే తన కామెంట్లకు వివరణ ఇచ్చుకొనే ప్రయత్నం చేశాడు. పుష్ప 2తో కానీ, ఆ టీమ్ తో గానీ తనకు ఎలాంటి విబేధాలూ లేవని, ఓ సినిమా వాడిగా పుష్ప 2 సాధించిన విజయాన్ని చూసి గర్విస్తున్నానని, సినిమా ఈవెంట్లకు అభిమానులు వస్తేనే బాగుంటుందని, ఎంత మంది అభిమానులు వస్తే, అంత ఉత్సాహం ఉంటుందని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ”ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. సినిమావాళ్లంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. వంద సినిమాలు విడుదలైతే ఒక్క సినిమా ఆడుతుంది. అలాంటప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే” అంటూ తాజాగా వ్యాఖ్యానించాడు. దాంతో… ఈ వివాదానికి తానే పుల్ స్టాప్ పెట్టినట్టైంది.
సిద్దార్థ్ హీరోగా నటించిన ‘మిస్ యూ’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిజానికి నవంబరు 29న ఈ సినిమా విడుదల కావాల్సివుంది. ‘పుష్ప 2’ ప్రభావం వల్ల… వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయ్యింది. తెలుగులో ఈసినిమాకు ఎలాంటి బజ్లేదు. సిద్దార్థ్ కూడా ఈసారి తెలుగు ప్రమోషన్లను పెద్దగా పట్టించుకోలేదనిపిస్తోంది. ‘పుష్ప 2’పై చేసిన కామెంట్స్ వల్ల.. ఈ సినిమాకు కాస్త పబ్లిసిటీ వచ్చింది. మరి అది ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.